అమెరికాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. డెల్టా వేరియెంట్ విజృంభణతో కొత కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఫ్లోరిడాలో వైరస్ ప్రారంభమైన నాటి నుంచి తొలిసారి ఆదివారం అత్యధిక కేసులు నమోదు కాగా.. ఆ మరుసటి రోజునే ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఏడాది క్రితం వ్యాక్సినేషన్ ప్రారంభానికి ముందు.. 2020 జులైలో ఒక్కరోజులో అత్యధికంగా 10,170 మంది ఆసుపత్రుల్లో చేరగా.. తాజాగా 10,207 మంది చేరినట్లు అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం తెలిపింది.
తాజా గణాంకాలతో రాష్ట్రాల వారీగా ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో తొలిస్థానానికి చేరుకుంది ఫ్లోరిడా. కొన్ని ఆసుపత్రుల్లో ఐసీయూల్లో పడకలు లేక హాల్స్లోనే బెడ్లు ఏర్పాటు చేస్తుండటం.. అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. గత వారంలో ఫ్లోరిడాలో రోజుకు సగటున 1,525 మంది పెద్దవారు, 35 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరేవారు. ఈ విషయంలోనూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది ఫ్లోరిడా.
" ఆసుపత్రుల్లో చేరుతున్నవారు, కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఫ్లోరిడా వ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు.. ప్రజలు కరోనా ముందరి స్థితికి చేరుకుంటున్న క్రమంలో ఇటీవలి పెరుగుదల ఆందోళనకరం. "
- జసొన్ సెలమి, ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా
గత శనివారం ఫెడరల్ హెల్త్ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫ్లోరిడాలో 21,683 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అంతకు ముందు రోజు 17,093 కేసులు వచ్చాయి. ఈ క్రమంలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్.
ఆస్ట్రేలియాలో లాక్డౌన్ పొడిగింపు..