అమెరికాలో కరోనా వైరస్ ఎలా విజృంభిస్తోందో తెలుసు కదా? 24 గంటల వ్యవధిలో అక్కడ 1050 మందికిపైగా మరణించారు. ఈ కారణంగా.. ఆంక్షల అమలులో ట్రంప్ సర్కారూ కఠినంగానే వ్యవహరిస్తోంది. అయితే.. కరోనా వైరస్ హెచ్చరికల్ని ఉల్లంఘించి ఫ్లోరిడా బీచ్‌లలో పార్టీలంటూ సందడి చేసిన విద్యార్థులను "మోస్ట్ ఫూలిష్ అమెరికన్స్"గా పేర్కొంది ఓ సర్వే. వీరితో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కూ అదే ట్యాగ్ వేసింది.
కరోనా విస్తృతి పెంచుకుంటూ పోతుంటే వీరంతా ఫ్లోరిడా, మయామీ సహా ఇతర బీచ్‌లు, నైట్‌క్లబ్‌లలో పార్టీలంటూ గడిపారు. వైరస్ కట్టడిలో కీలకమైన.. సామాజిక దూరం పాటించడాన్ని బేఖాతరు చేస్తూ గుంపులు గుంపులుగా ఉండటం, సన్నిహితంగా ఉంటూ కౌగిలించుకోవడమూ చేశారు. ఈ వార్త నెటిజన్లలో తీవ్ర ఆగ్రహానికి గురైంది.
ట్రంప్ కూడా ఇందుకు అతీతులేమీ కాదు. వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ టెస్టులు చేయడంలో జాప్యం చేయడం, సొంత పరిజ్ఞానం వాడటం విమర్శలకు దారితీసింది.
ఎక్కువ ట్రంప్‌కే..
ఏప్రిల్ పూల్స్ డే సందర్భంగా ఓ మీడియా కన్సల్టెంట్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. ఎక్కువ మంది ప్రజలు... పార్టీ చేసుకున్న విద్యార్థులను, ట్రంప్‌ను 'మోస్ట్ ఫూలిష్ అమెరికన్స్"గా పేర్కొన్నారు.