Flights cancellation omicron: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ విమానయాన సంస్థలపైనా పడింది. పండగ రోజుల్లో రద్దీ ప్రయాణాలతో వైరస్ బారిన పడుతున్న విమాన సిబ్బంది పెరుగుతున్న నేపథ్యంలో మూడు ప్రధాన విమానయాన సంస్థలు డజన్ల కొద్ది విమానాలను రద్దు చేశాయి.
జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ క్రిస్మస్ సెలవు రోజుల్లో డజన్‌కుపైగా విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. పైలట్స్, సిబ్బంది అనారోగ్యంతో సెలవులు పెట్టటమే అందుకు కారణమని తెలిపింది. ప్రస్తుత పండగల సీజన్లో పెద్ద సంఖ్యలో అదనపు సిబ్బందిని నియమించుకుంటున్నప్పటీ హ్యూస్టన్, బోస్టన్, వాషింగ్టన్కు విమానాలను నిలిపివేసినట్లు తెలిపింది. అయితే, ఇందుకు కొవిడ్-19 బారినపడటం, క్వారంటైన్ కారణమా అనేది చప్పలేమని పేర్కొంది. వైరస్ బారినపడినట్లు తమకు సిబ్బంది తెలియజేయలేదని పేర్కొంది.
ప్రస్తుత పండగ సీజన్లో భారీగా అదనపు సిబ్బందిని నియమించుకున్నప్పటికీ.. అధిక సంఖ్యలో సిబ్బంది అనారోగ్యానికి గురవుతున్నారని లుఫ్తాన్సా ప్రకటించింది. విమానాల రద్దుకు అదే ప్రధాన కారణమని పేర్కొంది.
జర్మనీలో మూడో దశ..!
కొద్ది రోజులుగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జర్మనీలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. క్రిస్మస్ పండగ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు ఆ దేశ ఆరోగ్య మంత్రి. ఒమిక్రాన్ కారణంగా దేశంలో మరో దశ ఉద్ధృతి వస్తుందని భావిస్తున్నారు అక్కడి అధికారులు. అయితే, ప్రస్తుతానికి డెల్టా కేసులే అధికంగా ఉండటం గమనార్హం. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య మంత్రి కార్ల్ లాటెర్బాచ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వైరస్ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.