తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2021, 12:37 PM IST

ETV Bharat / international

టైమ్ భవిష్యత్ నాయకుల జాబితాలో 'భారతీయం'

భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నాయకులతో వార్షిక జాబితా తయారు చేసింది ప్రఖ్యాత టైమ్ మేగజైన్. ఇందులో భారత్ నుంచి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్​తో పాటు ఐదుగురు భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకున్నారు.

Five Indian-origin persons, Indian activist feature in TIME magazine's list of 100 emerging leaders
టైమ్ భవిష్యత్ నాయకుల జాబితాలో 'భారతీయం'

'2021 టైమ్ 100 నెక్ట్స్​' పేరుతో టైమ్ మేగజైన్ రూపొందించిన జాబితాలో ఓ భారతీయుడితో పాటు ఐదుగురు భారత సంతతి వ్యక్తులు చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఎమర్జింగ్ నాయకులతో ఈ వార్షిక జాబితాను తయారు చేసింది టైమ్.

ట్విట్టర్ న్యాయవాది విజయా గడ్డె, యూకే ఆర్థిక మంత్రి రిషి సునక్, ఇన్​స్టాకార్ట్ సీఈఓ అపూర్వ మెహతా, 'గెట్ అస్ పీపీఈ' డైరెక్టర్ శిఖా గుప్తా, 'అప్​సాల్వ్​' స్వచ్ఛంద సంస్థ స్థాపకులు రోహన్ పవులూరి, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.

తర్వాతి ప్రధాని..

బ్రిటన్​లో కరోనా పోరును రిషి సునక్ ముందుండి నడిపించారని టైమ్ పేర్కొంది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి పెద్ద ఎత్తున సహాయం చేశారని తెలిపింది. లాక్​డౌన్ ఆంక్షలను త్వరగా సడలించినందుకు కొంతవరకు విమర్శలు ఎదురైనా.. ఇప్పటికీ బ్రిటన్​లో అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయ నాయకుడు అతనే అని తెలిపింది. బ్రిటన్ తర్వాతి ప్రధానిగా ఆయన రేసులో ఉన్నారని పేర్కొంది.

ఆజాద్

విద్య ద్వారా పేదరికాన్ని జయించేలా దళితుల కోసం భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ పాఠశాలలు నడుపుతున్నారని టైమ్స్ పేర్కొంది. కుల హింసకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపింది. వివక్షకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారని వివరించింది. యూపీ హాథ్రస్​లో దళిత యువతిపై గ్యాంగ్​రేప్ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నారని వెల్లడించింది.

ట్విట్టర్​ను మార్చిన విజయ

ట్విట్టర్ సంస్థలోని శక్తిమంతమైన ఎగ్జిక్యూటివ్​లలో విజయా గడ్డె ఒకరని టైమ్ అభివర్ణించింది. ట్రంప్ ఖాతాను నిషేధించిన విషయాన్ని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకి ఆమే తెలియజేశారని పేర్కొంది. ట్విట్టర్​లో అత్యధికంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందిన సమయంలో విజయ ప్రభావం వల్లే కంపెనీలో మార్పు వచ్చిందని తెలిపింది. ఫ్రీ స్పీచ్ అనేది మానవ హక్కు అనే భావన పెరిగిందని పేర్కొంది.

ఈ జాబితాలో ఉన్నవారందరూ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారని టైమ్ అభిప్రాయపడింది. ఇందులో చాలా మంది ఇప్పటికే చరిత్ర లిఖించారని పేర్కొంది.

ఇదీ చదవండి:స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష!

ABOUT THE AUTHOR

...view details