తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాకు బ్రేక్‌.. ఒక్క మాస్క్‌ చాలదా? - University of North Carolina Healthcare

కరోనా కట్టలు తెంచుకుంటున్న వేళ తాజా అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌కు కళ్లెం వేయాలంటే ఒక్క మాస్క్‌ చాలదని, డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్లే వైరస్‌ దరిచేరకుండా ఉంటుందని నిర్ధరణ అయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Coronavirus mask
కరోనా, మాస్కు, కరోనా నిబంధనలు

By

Published : Apr 18, 2021, 6:17 AM IST

Updated : Apr 18, 2021, 9:12 AM IST

కరోనా స్పీడుకు బ్రేకులు వేయాలంటే ఒక్క మాస్క్‌ పెట్టుకుంటే సరిపోదా? ప్రతి ఒక్కరూ రెండు మాస్క్‌లు ధరించాల్సిందేనా? కొవిడ్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ ఈ జిత్తులమారి వైరస్‌ మరింత ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్నవేళ కొత్త అధ్యయనం ఒకటి వెలుగులోకి వచ్చింది. మాస్క్‌ ధరించడంపై యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా హెల్త్‌ కేర్‌ జరిపిన కొత్త అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌కు కళ్లెం వేయాలంటే ఒక్క మాస్క్‌ చాలదని, డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్లే వైరస్‌ దరిచేరకుండా ఉంటుందని నిర్ధరణ అయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్క్‌లను పలు రకాలుగా పరీక్షించి జరిపిన ఈ అధ్యయన ఫలితాలు జేఏఎంఏ ఇంటర్నల్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

డబుల్‌ మాస్క్‌ ధరించడం వల్ల వైరస్‌ కణాలు ముక్కు, నోటి ద్వారా ప్రవేశించలేవని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. మాస్క్‌లలో పొరల సంఖ్య పెరగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, వాటిలో ఉన్న ఖాళీలు సరిగా పూడ్చినట్టుగా ఉండి ముఖానికి బిగువుగా ఉంటేనే వైరస్‌ ప్రభావం నుంచి తప్పించుకోగలుగుతామని పేర్కొంది. వడపోత సామర్థ్యం కలిగిన పదార్థాలతో మెడికల్‌ ప్రొసీజర్‌ మాస్క్‌లు తయారైనప్పటికీ అవి మన ముఖాలకు సరిగా సరిపోవని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూఎన్‌సీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అంటువ్యాధుల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎమ్లీ సిక్‌బెర్ట్‌ బెన్నెట్‌ తెలిపారు.

ఆ రెండు మాస్కులు వేసుకుంటే..

వస్త్రంతో చేసిన మాస్క్‌తో సర్జికల్‌ మాస్క్‌ను కలిపి వేసుకుంటే ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. మనుషుల ముఖాల్లో తేడాలను బట్టి ఈ మాస్క్‌ల సామర్థ్యం భిన్నంగా ఉంటుందని గుర్తించారు. మామూలుగా అయితే, సర్జికల్‌ మాస్క్‌లు వైరస్‌ కణాలను అడ్డుకోవడంలో 40 నుంచి 60శాతం సమర్థతను కలిగి ఉండగా.. వస్త్రంతో తయారు చేసిన మాస్క్‌లు 40శాతానికి పైగా సమర్థతతో ఉంటాయని తెలిపారు. సర్జికల్‌ మాస్క్‌పై వస్త్రం మాస్క్‌ను ధరించడం వల్ల వైరస్‌ను నిలువరించే సామర్థ్యం 20శాతం అధికంగా ఉన్నట్టు తాజా అధ్యయనంలో గుర్తించారు. అలాగే, దీనివల్ల మాస్క్‌లోని ఖాళీలు పూర్తిగా తొలిగి ముఖానికి బిగువుగా ఉంటూ స్థిరంగా ముక్కు, నోటిని కప్పి ఉంచుతున్నట్టుగా నిర్ధరణకు వచ్చారు.

అదే, వస్త్రం మాస్క్‌పై సర్జికల్‌ మాస్క్‌ను పెట్టుకుంటే ఫలితాలు అంత ఆశాజనకంగా లేవు. అలాగే, వదులుగా ఉన్న రెండు మాస్క్‌లను పెట్టుకోవడం వల్ల ప్రయోజనం కనిపించలేదని, దానికంటే సరిగా అమరిన ఒక మాస్క్‌ పెట్టుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నట్టు బెన్నెట్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను నివారించడంలో మాస్క్‌ ధరించడం ఎంత ప్రభావం చూపిస్తోందో ప్రస్తుత డేటాతో వెల్లడవుతోందన్నారు.

ఇదీ చూడండి:'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 67,123 కేసులు

Last Updated : Apr 18, 2021, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details