ఆమె ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా ప్రథమ మహిళ. శ్వేతసౌధానికి పట్టపురాణి! సుసంపన్నుడైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి. అధ్యక్షుడి భార్య హోదాలో మెలనియా వైట్‌హౌస్‌లో సమస్త రాజభోగాల్ని అనుభవిస్తున్నారని అనుకుంటాం. కానీ దీనికి పూర్తి భిన్నమైన జీవితాన్ని ఆమె ప్రస్తుతం అనుభవిస్తున్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది!! ఒకరకంగా ఆమె వైట్‌హౌస్‌లో ఒంటరి జీవితం గడుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఎడమొహం పెడమొహంగా గడుపుతారు. ట్రంప్ మొదటిభార్య కుమార్తె ఇవాంకాతోనూ మెలనియాకు సత్సంబంధాల్లేవు. అధ్యక్ష భవనంలో తన పాత్ర విషయంలో ఇవాంకతో ఆమె చాలాసార్లు విభేదించారు కూడా. ఏ అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనలకు వెళ్లినా, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ప్రథమ మహిళ పక్కన కనిపించేవారు. కానీ ట్రంప్ పక్కన మెలనియా అత్యంత అరుదుగానే కనిపిస్తుంటారు. ఒకవేళ కనిపించినా ఎడమొహం పెడమొహంగానే!! విదేశాలకు, అధికారిక కార్యక్రమాలకు చాలావరకు ట్రంప్ ఒక్కరే వెళతారు. గత ఏడాది అనారోగ్యంపాలైన మెలనియా దాదాపు మూత్రపిండాన్ని కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయారట! ‘‘ఫ్రీ మెలనియా- ద అనాథరైజ్డ్ బయోగ్రఫీ’ పేరుతో సీఎన్‌ఎన్ పాత్రికేయురాలు కేట్ బెనెట్ రాసిన పుస్తకంలో ఈ సంచలన వాస్తవాలు బయటపెట్టారు. వైట్‌హౌస్ పాత్రికేయ సిబ్బందిలో ఒకరైన కేట్ బెనెట్ ఎక్కువగా మెలనియా వ్యక్తిగత విషయాల్ని కవర్ చేస్తుంటారు.
స్లొవేనియాలో పుట్టిపెరిగినప్పటి నుంచి ప్రస్తుతం వైట్‌హౌస్‌లో పోషిస్తున్న పాత్ర దాకా మెలనియా జీవితంలోని అన్ని కోణాల్నీ గత మంగళవారం విడుదలైన 288 పేజీల ఈ పుస్తకం తడిమిచూసింది. ‘అత్యంత ప్రైవేటు జీవితం’ గడుపుతున్న మొట్టమొదటి ప్రథమ మహిళ మెలనియానేనని పుస్తకం విశ్లేషించింది. ఈ పుస్తకం బయటికి వచ్చినప్పటి నుంచి మెలనియా తన సొంత ఇంట్లోనే బందీగా గడుపుతున్నారంటూ సామాజిక మాధ్యమాలు హోరెత్తుతున్నాయి.
వేర్వేరు గదుల్లో నిద్ర
ట్రంప్, మెలనియాలు వైట్‌హౌస్‌లోని వేర్వేరు అంతస్తుల్లో, వేర్వేరు గదుల్లో నిద్రిస్తారని పుస్తకం బయటపెట్టింది. ట్రంప్ రెండో అంతస్తులో, మెలనియా మూడో అంతస్తులో పడుకుంటారని, ట్రంప్ తన గదికి తాళం వేయాలని సిబ్బందికి చెబుతారని పుస్తకం వివరించింది. మూడో అంతస్తులో మెలనియా కోసం రెండు వేరే గదులున్నాయి. గత అధ్యక్షుడు బరాక్ ఒబామా అత్త మరియన్ రాబిన్‌సన్ ఆ గదుల్లో ఉండేవారు. మెలనియా మేకప్ చేసుకోవడానికి ఒక అలంకరణ గది ఉంది. ఆమె కోసం ప్రైవేటు జిమ్ కూడా ఉంది.
ఇవాంక పొడ గిట్టదు!
అమెరికాలో ప్రస్తుతం అధ్యక్షుడు ట్రంప్ తర్వాత అంతటి శక్తిమంతమైన వ్యక్తి ఆయన కుమార్తె ఇవాంక. ట్రంప్ సలహాదారుగా ఆయన వెంట విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. దేశంలో మహిళా సంబంధ విషయాలనూ ఆమే చూసుకుంటారు. గత అధ్యక్షుల కాలంలో ఈ పనుల్ని ప్రథమ మహిళ చూసేవారు. ఇప్పుడు ఆ పనుల్లోకి ఇవాంక చొచ్చుకురావడం, ఓవల్ ఆఫీస్(అధ్యక్షుడి కార్యాలయం)లో క్రియాశీలంగా మెలగడం మెలనియాకు ఎంతమాత్రం రుచించడం లేదు. ఈ విధుల విషయంలో ఇవాంక, మెలనియాల మధ్య పెద్ద సంఘర్షణే నడుస్తోందని పుస్తకం బయటపెట్టింది. ‘‘ఐ రియల్లీ డోన్ట్ కేర్, డూ యూ’ అని రాసిన జాకెట్‌ను మెలనియా 2018లో ధరించారు. ఈ రాతలు ఇవాంకను ఉద్దేశించే అన్న చర్చ అప్పట్లో జరిగింది. కానీ ఆ జాకెట్ సందేశం మీడియాను ఉద్దేశించినది అని ఆ తర్వాత వైట్‌హౌస్‌తో పాటు మెలనియా వివరణ ఇచ్చారు. భర్త ట్రంప్ తుంటరి అలవాట్లను ప్రస్ఫుటించే సందేశాలుండే దుస్తుల్ని మెలనియా గతంలో చాలాసార్లు ధరించారు. మెలనియా, ఇవాంక మధ్య బంధం ‘సాదరమే తప్ప సన్నిహితం కాదు’ అని పుస్తకం విశ్లేషించింది.