అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటం, వైరస్ నుంచి కోలుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాల్లో మళ్లీ చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ట్రంప్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఈ విషయంపై అమెరికన్లలో అనేక సందేహాలు నెలకొన్నాయి. అసలు మెలానియా ట్రంప్ ఎక్కడ ఉన్నారు?
సమాచారం లేదు!
తనతో పాటు మెలానియాకు కూడా వైరస్ సోకినట్టు ఈ నెల 1న ప్రకటించారు ట్రంప్. ఆ తర్వాత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి.. అధ్యక్షుడి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం అందుతూ వచ్చింది. కానీ మెలానియా ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు శ్వేతసౌధం. అదే సమయంలో బహిరంగంగా ఆమె ఎప్పుడు కనపడతారనే విషయంపైనా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రథమ మహిళ కార్యాలయం కూడా ఈ విషయంపై ఎటువంటి సమాచారం అందివ్వకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తుది దశ ఎన్నికల ప్రచారాల్లో మెలానియా ట్రంప్ పాత్ర ప్రశ్నార్థకంగా మారింది.
మెలానియా ట్రంప్ చివరిగా గత నెల 29న ప్రజల్లోకి వచ్చారు. అధ్యక్ష అభ్యర్థుల మొదటి డిబేట్ కోసం ట్రంప్‌తో కలిసి క్లీవ్‌ల్యాండ్ వెళ్లారు.
ఇదీ చూడండి:-ఆ చికిత్సతో సూపర్‌మ్యాన్ అయిపోయా: ట్రంప్