అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఎన్నికలకు వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ట్రంప్ తరపున ప్రచారం చేయనున్నారు. పెన్సిల్వేనియాలోని అట్గ్లెన్ కౌంటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ప్రచార పర్వంలోకి ప్రథమ మహిళ మెలానియా - america trump campaign
అమెరికా ప్రథమ మహిళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్.. ప్రచార పర్వంలోకి అడుగుపెట్టనున్నారు. పెన్సిల్వేనియాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది.
అధ్యక్షుడి అజెండాను పెన్సిల్వేనియా ప్రజలకు మెలానియా వివరిస్తారని ట్రంప్ ప్రచార బృందం వెల్లడించింది. శ్వేతసౌధ మాజీ కౌన్సెలర్ కెల్లియానే కాన్వే ఈ సభను పర్యవేక్షిస్తారని తెలిపింది.
2019 జూన్ తర్వాత అధ్యక్షుడి ప్రచార కార్యక్రమాల్లో మెలానియా పాల్గొనలేదు. ట్రంప్ రెండో సారి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఓర్లాండోలో బిడ్ దాఖలు చేసిన కార్యక్రమానికి చివరిసారిగా హాజరయ్యారు. నిధుల సమీకరణ కోసం ఈ ఏడాది మార్చిలోనే ప్రచారపర్వంలోకి దిగాల్సిన మెలానియా ప్రణాళికలు కరోనా కారణంగా ఆగిపోయాయి.