కరోనాకు కళ్లెం వేసే టీకా కోసం యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్నవేళ అమెరికాలో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్, మోడెర్నా కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాను వచ్చే నెలలో 30 వేల మంది వాలంటీర్లపై ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు. ఇందుకోసం అవసరమైన డోసులను సిద్ధం చేసినట్లు మోడెర్నా తెలిపింది. ఈ టీకా పరీక్షలను మోడెర్నా మార్చిలోనే ప్రారంభించింది. తొలుత 45 మంది వాలంటీర్లపై ప్రయోగించింది. అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. వచ్చే నెల్లో భారీఎత్తున నిర్వహించే పరీక్షలతో టీకా అసలు సామర్థ్యం బయటపడే అవకాశముంది.
చైనా- బ్రెజిల్ వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ కోసం చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్‌తో బ్రెజిల్‌కు చెందిన ఇన్స్టిట్యూటో బుటాంటన్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సావో పాలో ప్రభుత్వం ప్రకటించింది.