తెలంగాణ

telangana

ETV Bharat / international

పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే షాపై అమెరికా ఆంక్షలు!

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పౌరసత్వ బిల్లుపై అమెరికా ప్రభుత్వం పరిధిలోని ఓ కమిషన్​ స్పందించింది. ఈ బిల్లు పార్లమెంట్​లో నెగ్గితే కేంద్ర హోం మంత్రి అమిత్​ షాపై ఆంక్షలు విధించాలని శ్వేతసౌధాన్ని కోరింది.

federal-us-commission-seeks-sanctions-against-home-minister-amit-shah-if-cab-passed-in-parliament
పౌరసత్వ బిల్లు ఆమోదం పొందితే అమిత్ షాపై అమెరికా ఆంక్షలు!

By

Published : Dec 10, 2019, 10:49 AM IST

'అంతర్జాతీయ మత స్వేచ్ఛ' కోసం పనిచేసే అమెరికా ఫెడరల్​ కమిషన్​(యూఎస్​సీఐఆర్​ఎఫ్​)... భారత ప్రభుత్వం ప్రతిపాదించిన పారసత్వ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా తప్పుబట్టింది. తప్పుడు దారిలో వెళ్తున్న ప్రమాదకరమైన చర్యగా దీనిని అభివర్ణించింది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందితే... కేంద్ర హోంమంత్రి అమిత్​ షాపై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరింది యూఎస్​సీఐఆర్​ఎఫ్​. లోక్​సభలో పౌరసత్వ బిల్లు ఆమోదంపై తీవ్ర విచారం వ్యక్తంచేసింది.

''ఒకవేళ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే.. హోం మంత్రి అమిత్​ షా, ఇతర నాయకత్వంపైనా అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.''

- కమిషన్​ ప్రకటన

వలసదారుల్లో ముస్లింలను మినహాయించి, ముఖ్యంగా మతం ప్రాతిపదికన పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోందని యూఎస్​సీఐఆర్​ఎఫ్​ ఆరోపించింది. అందరికీ సమాన హక్కులు కల్పించేలా రూపొందించిన భారత రాజ్యాంగానికి ఇది విరుద్ధంగా ఉందని తెలిపింది.

మనోళ్లు 'డోంట్​ కేర్'​...

యూఎస్​సీఐఆర్​ఎఫ్​ తరచూ ఇలాంటి ప్రతిపాదనలు, నివేదికలు ఇస్తూనే ఉంటుంది. కానీ... యూపీఏ హయాం నుంచి భారత్​ ఏనాడూ ఈ నివేదికల్ని పట్టించుకోలేదు. భారత్​లో మత స్వేచ్ఛను పరిశీలించేందుకు వస్తామని గతంలో యూఎస్​సీఐఆర్​ఎఫ్​ ప్రతినిధులు ఎన్నోసార్లు చెప్పినా... వారికి వీసాలు ఇవ్వలేదు కేంద్రం.

యూఎస్​సీఐఆర్​ఎఫ్​ ప్రతిపాదనల్ని అమెరికా ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరంలేదు. కానీ ఆ సిఫార్సుల్ని అవసరమైన సందర్భాల్లో అగ్రరాజ్య విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ ఉంటుంది.

ఇదీ చూడండి:శరణార్థులకు పౌరసత్వం.. సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details