తెలంగాణ

telangana

అమెరికాలో హింసకు అవకాశం- భద్రత పటిష్ఠం

By

Published : Nov 3, 2020, 12:55 PM IST

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. హింసాత్మక ఘటనలు తలెత్తకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శ్వేతసౌధం పరిసరాల్లో భద్రత భారీగా పెంచారు. అధ్యక్ష కాంప్లెక్స్ ఎదుట తాత్కాలిక గోడ నిర్మాణం చేపట్టారు. వాణిజ్య కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

US tightens security ahead of Tuesday's presidential poll
అమెరికాలో హింసకు ఛాన్స్!- భద్రత పటిష్ఠం

శ్వేతసౌధంతో పాటు అమెరికాలోని ప్రధాన వాణిజ్య కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో వీధుల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వంలోని కీలక విభాగాలన్నింటినీ అప్రమత్తం చేశారు. శ్వేతసౌధంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బందిని భారీగా మోహరించారు. అధ్యక్ష కాంప్లెక్స్​ ముందు తాత్కాలిక గోడ ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత విభజనపూరితమైనవిగా పరిగణిస్తున్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

శ్వేతసౌధ అధ్యక్ష కాంప్లెక్స్ ముందు తాత్కాలిక గోడ

ఆందోళనలకు పిలుపు!

అదే సమయంలో 'నల్లజాతీయుల ప్రాణాలు ముఖ్యమే' అంటూ ఉద్యమం సాగిస్తున్న నిరసనకారులు ఎన్నికల రోజున ఆందోళనలకు పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి వాషింగ్టన్ డీసీ నగర కేంద్రంలో సమావేశం నిర్వహణకు సిద్ధమయ్యారు. రిపబ్లికన్ మద్దతుదారులు సైతం ఇదే తరహా ప్రకటనలు చేశారు.

కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో వీరు నిరసనలకు పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది.

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికాలో భద్రత కట్టుదిట్టం

స్టోర్ల ప్రత్యేక ఏర్పాట్లు

పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతి చెందిన తర్వాత వాషింగ్టన్​లో జరిగిన హింసాత్మక నిరసనల్లో వందలాది దుకాణాలు ధ్వంసమయ్యాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన పౌర నిరసనలుగా పేరొందిన ఈ ఆందోళనల వల్ల ఒక బిలియన్ డాలర్ల నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత తలెత్తే హింస నుంచి రక్షించుకునేందుకు వాణిజ్య సముదాయాలు తమ స్టోర్ల గాజు కిటికీలకు అడ్డంగా చెక్కతో కవచాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ తరహా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వాణిజ్య సముదాయాల ముందు రక్షణ కవచాలు

ట్రంప్ 'ఆందోళనకర' ట్వీట్​

పోలీసు అధికారులు సైతం అత్యంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రేరేపిత హింస పెల్లుబుకే అవకాశం ఉందని కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ పోలీసు విభాగం అధిపతి డోమినిక్ రివెట్టి పేర్కొన్నారు. ఎన్నికల ఫలితం తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

మరోవైపు పెన్సిల్వేనియాలో ఓట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందిస్తూ... వీధుల్లో హింస తలెత్తే అవకాశం ఉందని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం హెచ్చరించారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్​.. ఎన్నికలు లేదా ఇతర ప్రక్రియల గురించి తప్పుదోవ పట్టించేలా ఉందని ట్విట్టర్​ 'ఫ్లాగ్' చేసింది. ఈ పరిస్థితుల మధ్య గట్టి నిఘా వేసి ఉంచారు అధికారులు.

ఇదీ చదవండి-అమెరికా ఎన్నికల వేళ.. భద్రత ఇలా..

ABOUT THE AUTHOR

...view details