తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇక ఇంటివద్దే కొవిడ్​ టెస్ట్​- 20 నిమిషాల్లోనే ఫలితం! - ఎల్యూమ్

అమెరికాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఇంటివద్దే చేసుకునే నూతన యాంటీజెన్ టెస్ట్ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియా కంపెనీ ఎల్యూమ్​ అభివృద్ధి చేసిన ఈ 'హోమ్ కొవిడ్​ టెస్టు'తో పరీక్ష చేసుకుంటే 20 నిమిషాల్లోపే ఫలితం వస్తుందని ఎఫ్​డీఏ పేర్కొంది.

FDA give emergency use authorization for home Covid test kits in America amid pandemic spread
ఇకనుంచి 'హోమ్​ కొవిడ్ టెస్ట్'!

By

Published : Dec 17, 2020, 8:40 AM IST

కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో దాన్ని ఆదిలోనే గుర్తించడం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షను ఇంటివద్ద స్వయంగా చేసుకునే నూతన యాంటీజెన్‌ టెస్ట్‌ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో ఇంటివద్దే స్వయంగా కొవిడ్‌ టెస్ట్‌ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి రానుంది.

ఆస్ట్రేలియా కంపెనీ ఎల్యూమ్‌ అభివృద్ధి చేసిన ఈ నూతన విధానానికి అత్యవసర వినియోగం కింద ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చింది. 'హోమ్‌ కొవిడ్‌ టెస్ట్‌' పేరుతో ఉన్న ఈ కిట్‌ను రెండేళ్లకు పైబడిన ఏ వ్యక్తైనా వినియోగించుకోవచ్చు. పాకెట్‌ సైజులో ఉండే ఈ కిట్‌లో స్వాబ్‌నుంచి సేకరించిన శాంపిల్‌ను అందులో పొందుపరచాలి. అనంతరం అది కరోనా వైరస్‌ ప్రోటీన్లను విశ్లేషించి.. కేవలం 20నిమిషాల్లోపే ఫలితాన్ని మన మొబైల్‌ ఫోన్‌కు పంపిస్తుంది.

ఒకేసారి వినియోగించేలా..

ఈ విధానంలో కరోనా వైరస్‌ లక్షణాలున్నవారిలో పాజిటివ్‌ను 96శాతం కచ్చితత్వంతో గుర్తిస్తుండగా, లక్షణాలు లేనివారిలో 91శాతం కచ్చితత్వంతో వైరస్‌ను గుర్తిస్తుందని ఎఫ్‌డీఏ ప్రకటించింది. అయితే, లక్షణాలున్నవారు, ఇతర టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవారు మాత్రం వైద్యులను సంప్రదించాలని ఎఫ్‌డీఏ సిఫార్సు చేసింది. ఒకేసారి వినియోగించగలిగే ఈ పరికరాన్ని ఆన్‌లైన్‌, స్టోర్‌లలో దాదాపు 30డాలర్లకు విక్రయించే అవకాశాలున్నాయని ఎల్యూమ్‌ పేర్కొంది. వచ్చే నెలలో లక్షల సంఖ్యలో ఈ పరికరాలను అమెరికాకు రవాణా చేస్తున్నట్టు ఆస్ట్రేలియన్‌ కంపెనీ వెల్లడించింది. ఈ నూతన విధానం వల్ల కొవిడ్‌ టెస్టు సౌకర్యం విస్తృతంగా అందుబాటులోకి రానున్నట్లు ఎఫ్‌డీఏ అభిప్రాయపడింది. అమెరికాలో కరోనా వైరస్‌కేసుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ కిట్‌ల వల్ల ప్రస్తుతం చేపడుతోన్న కొవిడ్‌ టెస్టులపై కాస్త భారం తగ్గనుందని తెలిపింది.

ఇంటివద్ద సొంతంగా చేసుకునే సౌలభ్యమున్న ఇలాంటి కొవిడ్‌ టెస్టులకు ఎఫ్‌డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కానీ, ఎల్యూమ్‌ తయారుచేసిన ఈ పరికరంతో కచ్చితమైన ఫలితం రావడంతో పాటు కేవలం నిమిషాల్లోనే ఫలితం వస్తోంది. అంతేకాకుండా దీనికి ఎటువంటి డాక్టర్‌ ప్రిస్‌క్రిప్షన్‌ కూడా అవసరం లేదని కంపెనీ వెల్లడించింది. ఇంటివద్దే కరోనా టెస్టు చేసుకునేందుకు వీలుగా 'ల్యూరికా' అనే కంపెనీకి కూడా ఎఫ్‌డీఏ గతనెలలో అనుమతి ఇచ్చింది. అయితే, కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయని వైద్యులు భావించి సిఫార్సు చేస్తేనే ఈ పరికరాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

మరికొన్ని కంపెనీలు సొంతంగా స్వాబ్‌ శాంపిల్‌ను సేకరించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చాయి. కానీ, వీటి విశ్లేషణ కోసం మాత్రం శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. కచ్చితమైన ఫలితం క్షణాల్లో రావడంతో ఎల్యూమ్‌ తయారు చేసిన ఈ విధానం కొవిడ్‌ టెస్టుల్లో కీలక మైలురాయిగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:కరెన్సీ మ్యానిప్యులేటెడ్ దేశాల జాబితాలో భారత్

ABOUT THE AUTHOR

...view details