అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ చేసే ప్రమాణస్వీకార కార్యక్రమంలో అంతరంగిక వ్యక్తులు దాడికి పాల్పడే అవకాశం ఉందని సైనికాధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ప్రమాణస్వీకార మహోత్సవానికి కొద్ది గంటలు మిగిలి ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ కార్యదర్శి ర్యాన్ మెకార్తీ సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే గుర్తించాలని స్పష్టం చేశారు. ప్రమాద ముప్పు గురించి తమకు అవగాహన ఉందని, అయితే ఇప్పటివరకు అలాంటి సూచనలు కనిపించలేదని స్పష్టం చేశారు. కార్యక్రమం కోసం విధుల్లో ఉన్నవారందరినీ నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. అంతర్గతంగా తలెత్తే దాడిని పసిగట్టడంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, సాధారణ ప్రమాణస్వీకారాలతో పోలిస్తే రెట్టింపు కన్నా ఎక్కువ సిబ్బందిని భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఇందుకోసం కోసం కేటాయించిన 25 వేల మంది నేషనల్ గార్డ్ సిబ్బంది వాషింగ్టన్కు చేరుకుంటున్నారు. ఆర్మీ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఎఫ్‌బీఐ అధికారులు అప్రమత్తమయ్యారు. వాషింగ్టన్కు వస్తున్న ప్రతిఒక్క నేషనల్ గార్డ్‌ను పరిశీలిస్తున్నారు.
అయితే ఎలాంటి ప్రమాదాన్నైనా పసిగట్టేందుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని నేషనల్ గార్డ్ బ్యూరో చీఫ్ జనరల్ డేనియెల్ ఆర్ హోకాన్సన్ స్పష్టం చేశారు. రాజధానిలో భద్రతను సమీక్షించారు.