ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో దాదాపు 40వేల మంది వైరస్ బారిన పడుతున్నారు . ప్రజలు ఆరోగ్య సూచనలు, మార్గదర్శకాలను విస్మరిస్తే ఒక్కరోజులో నమోదయ్యే కేసుల సంఖ్య లక్షకు చేరుతుందని అమెరికా అంటువ్యాధుల నివారణ జాతీయ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంథోని ఫౌచీ హెచ్చరించారు.
పాఠశాలలు, కార్యాలయాలు తిరిగి ప్రారంభించాలనే విషయంపై సెనేట్లో చర్చ సందర్భంగా ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు. వైరస్ కేసుల సంఖ్యను కొన్ని రాష్ట్రాల్లో కచ్చితంగా అంచనా వేయలేమని చెప్పారు.
"ప్రస్తుతం దేశంలో రోజుకు 40వేలకు పైగా కొత్త కేసులు బయటపడుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. కరోనా కేసులు తగ్గించడంలో పురోగతి సాధించిన ప్రాంతాలతో సహా ఇటీవల వైరస్ వ్యాప్తి ప్రారంభమైన ప్రాంతాలు.. దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందుకు ఆందోళన చెందుతున్నాను."