భారత్‌లో కరోనా రెండో దశ కట్టడికి అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నివారణ నిపుణుడు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైద్య సలహాదారుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ కీలక సూచనలు చేశారు. వెంటనే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం సహా చైనా తరహాలో అత్యవసర చికిత్సా కేంద్రాలు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం, కరోనా పరిస్థితులపై సమగ్ర పర్యవేక్షణకు కేంద్రీకృత వ్యవస్థ ఉండాలంటూ ఫౌచీ మూడు కీలక ప్రతిపాదనలు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభం కాగానే చైనా కూడా ఇదే చర్య చేపట్టిందని పేర్కొన్నారు.
" లాక్‌డౌన్ విధించడానికి ఎవరూ సుముఖత చూపించరు. కానీ ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి అదుపులోకి రావాలంటే అదొక్కటే మార్గం. దీనిని నెలల పాటు విధించాల్సిన అవసరం లేదు. కొద్ది వారాలు అమలు చేస్తే చాలు. వైరస్ను కట్టడి చేసేందుకు తక్షణం చేపట్టే చర్యలు, దీర్ఘకాలంలో చేపట్టేవి ఉంటాయి. లాక్‌డౌన్ విధించడం సహా ఆక్సిజన్, పీపీఈ కిట్లు వంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం తక్షణం చేపట్టాల్సిన చర్యలు. కరోనాపై విజయం సాధించామని ప్రభుత్వాలు భావించాయి. 139 కోట్ల జనాభాలో ఇప్పటివరకు కేవలం 2 శాతం మందికే టీకాలు అందాయి."
-ఆంటోనీ ఫౌచీ, అమెరికా వైద్య సలహాదారు