కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో అమెరికా ప్రస్తుతం 'తప్పు మార్గం'లో వెళుతోందని అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మందగించడంతోపాటు డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించడం పట్ల అమెరికా అధికారులను డాక్టర్ ఫౌచీ మరోసారి హెచ్చరించారు.
'దేశంలో ఇంకా సగం మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదు. ఇది అమెరికాకు పెద్ద సమస్య. రానున్న రోజుల్లో కొవిడ్ మరణాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంచనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం తప్పు మార్గంలో వెళుతున్నామని తెలుస్తోంది' అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా మాస్కు తప్పనిసరి ధరించాలని లాస్‌ఏంజిల్స్, సెయింట్ లూయిస్ రాష్ట్రాలు ఆదేశాలు జారీచేయడాన్ని ఫౌచీ సమర్థించారు. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు మాస్కులు ధరించనవసరం లేదని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం (CDC) మార్గదర్శకాలు జారీ చేయడం పట్ల ఆంటోని ఫౌచీ ఈ విధంగా స్పందించారు.