తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​పై పోరులో 'డెల్టా'నే అతి పెద్ద ముప్పు! - covid vaccination

కరోనా వైరస్​ రకాల్లో డెల్టా వేరియంట్​.. పెను సవాలు విసరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 100 దేశాలకుపైగా విస్తరించిన ఈ రకం.. అమెరికాలోనూ భయంకరంగా మారే సూచనలున్నాయని చెబుతున్నారు ప్రముఖ వైద్య నిపుణులు ఆంటోనీ ఫౌచీ. వేగంగా వ్యాపించే ఈ వేరియంట్​.. కొవిడ్​పై పోరులో అతి పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని అంటున్నారు.

delta variant
డెల్టా వేరియంట్

By

Published : Jun 25, 2021, 2:17 PM IST

భారత్​లో తొలిసారి వెలుగుచూసిన కరోనా రకం 'డెల్టా వేరియంట్'​.. అమెరికాలో వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని హెచ్చరించారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ. అందుకే.. ప్రజలందరినీ వీలైనంత త్వరగా టీకా వేసుకోవాలని కోరారు.

''అమెరికాలో కొవిడ్​-19ను అంతం చేసే ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ అతి పెద్ద ముప్పుగా పరిణమించింది. శుభవార్త ఏంటంటే.. రెండు వ్యాక్సిన్లు ఈ వేరియంట్​పై సమర్థంగా పనిచేసే అవకాశం ఉంది. మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వాటితో.. కరోనాను తరిమికొడదాం.''

- ఆంటోనీ ఫౌచీ, అమెరికా వైద్య నిపుణులు

ఓ అధ్యయనం ప్రకారం.. ఇప్పటివరకు వచ్చిన కొవిడ్​-19 వేరియంట్లలో వేగంగా విస్తరించే లక్షణాలు డెల్టా వేరియంట్​కు ఉన్నాయి. అమెరికాలో నమోదైన కొత్త కేసుల్లో 20 శాతానికిపైగా ఈ రకానివే.

దీనికి తోడు కొత్తగా డెల్టా ప్లస్​ వేరియంట్​ కూడా.. దాదాపు 10 దేశాల్లో వ్యాపించింది. ఇది డెల్టా కంటే ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. ఇవన్నీ అమెరికా సహా ప్రపంచ దేశాల్లో మళ్లీ భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

అసలు డెల్టా, డెల్టా ప్లస్​ వేరియంట్లు అంటే ఏంటి? వాటి వ్యాప్తి ఎలా ఉంది? ఏఏ దేశాల్లో విస్తరించింది? ప్రమాద తీవ్రత ఎంత? అనే వివరాలు తెలుసుకుందాం.

డెల్టా వేరియంట్​..

  • డెల్టా వేరియంట్​/బి.1.617.2 కరోనా రూపాంతరాన్ని 2020 అక్టోబర్​లో తొలుత భారత్​లోనే గుర్తించారు అధికారులు.
  • 2021, మే 11న దీనిని ఆందోళనకరమైనదిగా(వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్- వీఓసీ) పరిగణించాలని​ పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ).

ఇప్పటివరకు నాలుగు వేరియంట్లను వీఓసీగా ప్రకటించింది డబ్ల్యూహెచ్​ఓ. అవి డెల్టా వేరియంట్​ సహా ఆల్ఫా(యూకేలో తొలిసారి గుర్తించారు), బీటా(సౌతాఫ్రికాలో తొలిసారి), గామా(బ్రెజిల్​లో తొలిసారి వెలుగుచూసింది).

డేంజర్​..?

అన్నింటిలో డెల్టా వేరియంట్​లో 10 మ్యుటేషన్లు ఉన్నాయని, ఇవి మానవ కణాలపై వేగంగా దాడి చేస్తాయని సీడీసీ చెబుతోంది. ఆ వైరస్​ జన్యువుల్లో మార్పులు చేస్తే.. ఆ వేరియంట్​ ప్రభావం, నియంత్రణకు అవకాశం ఉంటుందని నిపుణులు తెలిపారు.

ఏఏ దేశాల్లో డెల్టా ప్రభావం?

  • డెల్టా వేరియంట్​ ఇప్పటివరకు అమెరికా సహా 92 దేశాలకు విస్తరించింది.
  • బ్రిటన్​లో రోజువారీ కొత్త కేసుల్లో 90 శాతం డెల్టావే.

అమెరికాలో ఇది 20 శాతంగా ఉంది. ఇప్పటివరకు అక్కడ తీవ్ర ప్రభావం చూపిన అల్ఫా వేరియంట్​ కంటే ఇది ప్రమాదకరమని సీడీసీ డైరెక్టర్​ డా. రాచెల్లీ వాలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

జెట్​ స్పీడ్​లో..?

నేచర్​ న్యూస్​ ప్రకారం.. అల్ఫాతో పోలిస్తే, డెల్టా వేరియంట్​ వ్యాప్తి 60 శాతం అధికంగా ఉంది. మొట్టమొదట వెలుగుచూసిన కరోనా రకం కంటే.. వ్యాప్తిలో 50 శాతం ముందుంది అల్ఫా.

అంత ప్రమాదకరమైనదా?

వ్యాధి తీవ్రతను బట్టి.. డెల్టా వేరియంట్​ రోగిపై ప్రభావం చూపే అవకాశముందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆల్ఫాతో పోల్చి చూస్తే.. డెల్టా బారినపడ్డ వ్యక్తి ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం రెండు రెట్లు అధికంగా ఉంది.

అయితే.. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ, తీవ్ర ప్రమాదమా అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు.

వ్యాక్సిన్లు పనిచేస్తాయా?

డెల్టా వేరియంట్​పై వ్యాక్సిన్లు పనిచేస్తాయని, అయితే.. ఎక్కువగా ఇతర మ్యుటేషన్లు ఉత్పరివర్తనం చెందకుండా, వ్యాప్తిని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుందని ఫౌచీ సహా అమెరికాలోని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఆంటోనీ ఫౌచీ

అందుకే వీలైనంత త్వరలో అందరూ వ్యాక్సిన్​ వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

  • టీకా తయారీదారులు మాత్రం డెల్టా వేరియంట్​పై తమ వ్యాక్సిన్లు సమర్థంగానే పనిచేస్తాయని ప్రకటించుకుంటున్నాయి. డెల్టా రకంపై ఫైజర్​ 88 శాతం, ఆస్ట్రాజెనెకా 60 శాతం సమర్థంగా పనిచేస్తున్నాయని వెల్లడించాయి. ఇది ఆల్ఫాతో పోలిస్తే మాత్రం చాలా తక్కువే.
  • రష్యాకు చెందిన స్పుత్నిక్​-వి టీకా.. ఇతర వ్యాక్సిన్లంటింకంటే సమర్థంగా పనిచేస్తుందని జూన్​ 15న ట్విట్టర్​లో ప్రకటించుకుంది.

ఆ దేశాల్లో సంక్షోభం..

డెల్టా వేగంగా విస్తరిస్తే మాత్రం.. పలు దేశాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని నేచర్​ న్యూస్​ పేర్కొంది. వ్యాక్సిన్లు అందని చాలా దేశాలు.. తీవ్రంగా ప్రభావితమవుతాయని అంచనా వేసింది.

ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇప్పటికీ.. అక్కడి జనాభాలో 5 శాతం మందికి కూడా టీకా అందలేదు.

డెల్టా ప్లస్​ వేరియంట్​

  • డెల్టా వేరియంట్​లోని కొత్త రకం.. డెల్టా ప్లస్​ వైరస్​ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దాదాపు 10 దేశాలకు పైగా విస్తరించింది. అమెరికాలో 80 మందికిపైగా సోకినట్లు తెలుస్తోంది.
  • భారత్​లోనూ 40కిపైగా కేసులున్నాయి. దీనిని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​గా గుర్తించింది. డెల్టాతో పోల్చితే ఇది ఇంకా ప్రమాదకరమైనదిగా భావిస్తోంది.
  • సౌతాఫ్రికాలో బీటా వేరియంట్​లోనూ.. ఈ డెల్టా ప్లస్​ రకం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇది మరింత ప్రమాదకరమా?

మనం టీకా తీసుకున్నప్పటికీ ఈ వైరస్​ సోకే అవకాశాలున్నాయని పేర్కొన్నారు వైద్య నిపుణులు, ఇండియన్​ అసోసియేషన్​ ఆఫ్​ ప్రివెంటివ్​ అండ్​ సోషల్​ మెడిసిన్​(ఐఏపీఎస్​ఎం) అధ్యక్షురాలు డా.సునీలా గార్గ్. మనలో యాంటీబాడీలు ఉన్నా, వ్యాక్సిన్​ తీసుకున్నా.. వైరస్​కేం అడ్డురాదని వివరించారు.

ప్రముఖ వైరాలజిస్ట్​ డా. జెరెమీ కామిల్​ మాత్రం.. డెల్టా ప్లస్​ వెలుగుచూసి కొద్దిరోజులే అయింది కనుక, దీనిపై అప్పుడే ఓ అంచనాకు రాలేమంటున్నారు.

''నేను ఇప్పుడే ఏం చెప్పలేను. భారత్​ సహా ఇతర ప్రపంచ దేశాలేవీ డెల్టా ప్లస్​గా పిలిచే వేరియంట్​పై సరైన, పూర్తిస్థాయి సమాచారాన్ని సేకరించాయని అనుకోవట్లేదు. అందుకే దీనిని డెల్టా వేరియంట్​ కంటే ప్రమాదకరమైందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం.''

- డా. జెరెమీ కామిల్​, వైరాలజిస్ట్​

ఇవీ చదవండి: DeltaPlus: నెల రోజుల క్రితమే తొలి మరణం!

డెల్టా ప్లస్​తో మరో ముప్పు తప్పదా- నిపుణుల మాటేంటి?

Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

ABOUT THE AUTHOR

...view details