ఒక ఆఫ్రికన్ అమెరికన్ మెడపై మోకాలు నొక్కిపెట్టి అతని మృతికి కారణమైన పోలీస్ అధికారిపై సామాజిక మాధ్యమాల్లో పుకార్లు ప్రచారంలోకి వచ్చాయని అధికారులు స్పష్టం చేశారు. సోమవారం అతని మృతికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత అమెరికాలో వివిధ రకాలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
ఈ ఘటనలో జార్జ్ మృతికి కారణమైన డెరెక్ చావిన్ గత అక్టోబర్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ర్యాలీలో 'మేక్ వైట్స్ గ్రేట్ అగెయిన్' అనే టోపీ ధరించాడంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. అది వైరల్‌గా మారి.. ఆందోళనలకు దారి తీసింది. దీంతో మినియాపొలిస్ అధికారులు వాస్తవాలను వెల్లడించారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసులెవరూ ట్రంప్ ర్యాలీలో పాల్గొనలేదని స్పష్టం చేశారు.