క్యాపిటల్ హిల్‌పై దాడికి తమ మద్దతుదారులను ప్రేరేపించారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చింది సెనేట్. ఈ క్రమంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్లపై విమర్శలు గుప్పించింది అధికార డెమొక్రటిక్ పార్టీ. మాజీ అధ్యక్షుడిని రక్షించేందుకు వేసిన వారి ఓటు అమెరికా సెనేట్ చరిత్రలో అపఖ్యాతి ఓటుగా నిలిచిపోతుందని పేర్కొంది.
సెనేట్‌లో నాలుగు రోజుల పాటు విచారణ చేపట్టిన అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 57-43 ఓట్లతో అభిశంసన వీగిపోయింది. ఏడుగురు రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా 43 మంది మద్దతు పలికారు. ఈ క్రమంలో వారిపై విమర్శలు గుప్పించారు సెనేట్ మెజారిటీ నేత చక్ షూమర్.
" అమెరికా చరిత్రలో జనవరి 6వ తేదీ దుర్దినంగా నిలిచిపోతుంది. అలాగే.. డొనాల్డ్ ట్రంప్‌ను దోషిగా తేల్చటంలో విఫలమవటం కూడా సెనేట్ చరిత్రలో అపఖ్యాతి ఓటుగా ఉండిపోతుంది. రిపబ్లికన్ నాయకుడితో పాటు.. మెజారిటీ కలిగిన సెనేట్ రిపబ్లికన్ కాకస్ ట్రంప్‌ను నిర్దోషిగా తేల్చేందుకు ఓటు వేసింది. ఆయనతో పాటు వారి పేర్లు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా లిఖించుకున్నారు. ట్రంప్‌ను వదిలేసేందుకు ఏ అంశాన్ని పరిగణించారు? ఎన్నికల ఫలితాలను తారుమారు చేసినందుకు ప్రయత్నించినందుకా? సొంత ప్రభుత్వంపై దాడి చేయాలని ప్రేరేపించినందుకా? "
- చక్ షూమర్, సెనేట్ మెజారిటీ నేత
రిపబ్లికన్లపై పెలోసీ విమర్శలు..