తెలంగాణ

telangana

ETV Bharat / international

పాత టీమ్, కొత్త స్కెచ్​తో అధ్యక్ష ఎన్నికలకు ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే. 2016లో జరిగిన ఎన్నికల్లో 'అమెరికా ఫస్ట్' నినాదంతో అనూహ్య విజయం సాధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో మళ్లీ పాత వ్యూహాలకు పదును పెడుతున్నారు ట్రంప్. అప్పట్లో తనకు సలహాదారులుగా పనిచేసినవారిని మళ్లీ తన బృందంలోకి తెచ్చుకున్నారు. 2016తో పోలిస్తే పరిస్థితులు వేగంగా మారిన నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యూహాలు ఫలిస్తాయా?

US-TRUMP-TEAM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

By

Published : Jun 11, 2020, 9:38 AM IST

హిల్లరీ క్లింటన్​ రూపంలో బలమైన ప్రత్యర్థి... వేర్వేరు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత... గతానికి సంబంధించి ఎన్నో ఆరోపణలు... అయినా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించారు డొనాల్డ్ ట్రంప్. ఇందుకు ప్రధాన కారణాలు... ట్రంప్​ జపించిన స్వదేశీ మంత్రం, ఆయన బృందం అమలు చేసిన తెరవెనుక వ్యూహమే అంటారు విశ్లేషకులు.

మూడున్నరేళ్లు గడిచాయి. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. ట్రంప్​ మరోమారు విజయం సాధించడం అంత ఆషామాషీగా కనిపించడంలేదు. మూడున్నరేళ్ల పాలనతో నెలకొన్న ప్రజా వ్యతిరేకత, కరోనా సంక్షోభం, ఆర్థిక మందగమనం, జాతివివక్షపై ఆందోళనలు... ఆయనకు పెను సవాళ్లు విసురుతున్నాయి. అందుకే మరోమారు విజయతీరాలకు చేరేందుకు పాత ఫార్ములానే నమ్ముకున్నారు ట్రంప్.

ఈ దిశగా ఇప్పటికే ముందడుగు వేస్తూ 2016లో ప్రచారంలో తన కోసం పని చేసిన అనుభవజ్ఞులను ట్రంప్ మళ్లీ నియమించారు. వీరి నియామకంతో ట్రంప్​ అసలైన జట్టులోని ఇతర సభ్యులూ వెస్ట్​ వింగ్​కు రానున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫార్ములా సామర్థ్యంపై పలువురు విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్వదేశీ మంత్రం పనిచేస్తుందా?

అయితే 2016 పరిస్థితులు 2020లో లేవన్నది విశ్లేషకుల మాట. ఈ మధ్య కాలంలో ట్రంప్​ ఎదుర్కొన్న సంక్షోభాలపై ఆయన సలహాదారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా కారణంగా ఆరోగ్యం, ఆర్థిక మందగమనం నుంచి తాజాగా జరుగుతోన్న దేశవ్యాప్త నిరసనలు ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడుతున్నారు.

"2016లో పనిచేసిన బృందాన్ని మళ్లీ పునరుద్ధరించటం స్వాగతించాల్సిందే. అయితే నిజాలను అంగీకరించక తప్పదు. అప్పట్లో ఆయన గెలిచారు. కానీ ఆ మద్దతును కాపాడుకునేందుకు ఆయనేమీ చేయలేదు. స్వదేశీ సూత్రంతో మళ్లీ గెలవలేరు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నినాదాలు, అజెండాలకు ఇది సమయం కాదు. దేశానికి ఏం చేశారు? మళ్లీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి? అనే ప్రశ్నలపై విజయం ఆధారపడి ఉంటుంది."

- శామ్​ నన్​బర్గ్, 2016లో సలహాదారు

గతంలో అనుసరించిన వ్యూహాలను ట్రంప్ ఇప్పుడు అమలు చేయలేరన్నది స్పష్టం. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చేసిన 3 ర్యాలీలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని శ్వేతసౌధ అధికారిక వర్గాలే వెల్లడించాయి.

కరోనాకు ముందు బలమైన ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ప్రచారం నిర్వహించాలని ట్రంప్ భావించారు. రాష్ట్రాల్లోని పరిస్థితుల ఆధారంగా డెమొక్రాట్లను ఎదుర్కోవచ్చని ఆశించారు. అంతకుమించి ప్రత్యర్థి జో బిడెన్​పై ఎలాంటి ప్రణాళికలను రచించలేదు.

అన్నీ అందుబాటులో ఉన్నా..

విజయంపై బయటకు నమ్మకంగా ఉన్నప్పటికీ.. బిడెన్​ వెనుకబడి ఉన్నట్లు చెబుతోన్న పోల్స్​పై విశ్వాసం లేదని తన సలహాదారులతో ట్రంప్ వ్యక్తిగతంగా అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తన ప్రచార వ్యవహారాలను చూసే బ్రాడ్ పార్​స్కేల్​పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

గతంతో పోల్చితే ఈ ప్రచారంలో ట్రంప్​కు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. అయినప్పటికీ 2016 నాటి అనుభవజ్ఞులను తిరిగి తీసుకురావటం చూస్తే... ట్రంప్​ వెనుకబడి ఉన్నారనో లేక పార్​స్కేల్​పై నమ్మకం సన్నగిల్లిందనో చెప్పవచ్చు.

ఎవరెవరు వచ్చారంటే..

ట్రంప్​ బృందంలో కొత్తగా చేరినవారిలో జేసన్​ మిల్లర్​ (2016లో కమ్యూనికేషన్ డైరెక్టర్​), బిల్​ స్టెపీన్​ (2016లో ముఖ్య సలహాదారు), బోరిస్ ఎప్స్​టీన్​ తదితరులు ఉన్నారు. బానన్​, కీత్​ షిల్లర్​ వంటి కొందరు పాత సభ్యులు మాత్రం ఈ బృందంలో చేరలేదు.

2016 బృందంలో పనిచేసిన ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్, అల్లుడు జేర్​డ్ కుష్నర్, కుమారులు డొనాల్డ్ జూనియర్, ఎరిక్​ ట్రంప్​​ ఇప్పటికీ కొనసాగుతున్నారు. వీరితోపాటు కెల్లీయానీ కాన్వే, డాన్​ స్కావీనో కూడా ట్రంప్ టీమ్​లోనే ఉన్నారు.

ఏకీభవించే వారికే ప్రాధాన్యం..

ఆయన ఎప్పుడూ తను విశ్వసించే కొంతమంది వ్యక్తులపైనే ఆధారపడతారని ట్రంప్ జీవిత చరిత్ర రచయిత టిమోతీ ఒబ్రెయిన్​ వెల్లడించారు. కానీ విశ్వసించటం, సామర్థ్యాన్ని అంచనా వేయటంలో చాలా వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు. తనతో ఏకీభవించే వ్యక్తులనే ట్రంప్ నియమించుకుంటారని తెలిపారు. ట్రంప్ ఒక బుడగలోనే జీవిస్తారని అభిప్రాయపడ్డారు ఒబ్రెయిన్​.

ఇదీ చూడండి:ఆ మూడు ఎన్నికల కోసం ఐరాస పక్కా ప్రణాళిక

ABOUT THE AUTHOR

...view details