అమెరికా అధ్యక్షుడైనా.. నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాఖ్యలు చేస్తే వాటిని తొలగిస్తామని ఫేస్‌బుక్ ప్రకటించింది. కరోనా వైరస్ లేదా ఎన్నికలకు సంబంధించి తమ ప్రమాణాలకు విరుద్ధంగా విద్వేష పూరిత, అసత్య సమాచారాన్ని షేర్ చేస్తే దానికి ఫేస్‌బుక్‌లో స్థానముండదని సంస్థ సీఓఓ షెరిల్ సాండ్‌బెర్గ్ ప్రకటించారు.
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాలను ఏవిధంగా పర్యవేక్షిస్తారనే ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విధంగా స్పందించారు. కాగా, అమెరికా ఓటర్లకు ఎన్నికలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందించేందుకు ఫేస్‌బుక్ గత వారం 'ఓటింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్' (ఓటింగ్ సమాచార కేంద్రం) ప్రారంభించింది.
సొంత ఉద్యోగుల నుంచే..
గతంలో పోలీసుల అదుపులో ఉన్న నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతితో ఊపందుకున్న 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' ఉద్యమాన్ని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్‌లో పరుష వ్యాఖ్యలు చేశారు. అయితే సంస్థ యాజమాన్యం వాటిని తొలగించకపోవటం వల్ల.. ఇతరులతో పాటు సొంత ఉద్యోగుల నుంచి విమర్శలకు గురైంది.
భారత్‌లోనూ..
భారత్‌లో కూడా ఫేస్‌బుక్ వ్యవహార శైలి ఇటీవల వివాదాస్పదమైంది. కొన్ని పార్టీలకు చెందిన ప్రసంగాలు, పోస్టులపై సంస్థ చూసీచూడనట్టుగా ఉంటోందని విమర్శలు చెలరేగాయి. దీనితో తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని సంస్థ ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంస్థ సీఓఓ తాజా ప్రకటనతో ఫేస్‌బుక్ వైఖరి మరింత స్పష్టమైనట్లేనని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: ఫేస్‌బుక్ టార్గెట్- కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం