ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... సామాజిక మాధ్యమాలనూ వణికిస్తోంది. ఎలా అంటారా? ప్రజలు కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీనితో ఒక్కసారిగా ఒంటరి అయిపోయిన ఫీలింగ్ వారిని ఆవరిస్తోంది. ఈ ఒంటరితనాన్ని తప్పించుకునేందుకు వారికి ఉన్న ఒకే ఒక మార్గం సోషల్ మీడియా. అందుకే ఫేస్బుక్ వాడకం పెంచారు. వాట్సాప్ వినియోగదారులు వాయిస్, వీడియో కాల్స్‌ను విపరీతంగా చేస్తున్నారు. దీనితో ఒక్కసారిగా వాట్సాప్ సర్వర్లుపై భారం పెరిగిపోయింది.
ఒక్కసారిగా పెరిగిపోయిన వినియోగాన్ని ఆయా సోషల్ మీడియా సర్వర్లు తట్టుకోలేకపోతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆయా సంస్థలు నడుంబిగించాయి. వాటిలో ఒకటి సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్.
వాట్సాప్ సామర్థ్యం పెంపు...
ఫేస్బుక్ తాజా సమస్యకు పరిష్కారంగా తమ సర్వర్ల సామర్థ్యం పెంచుతోంది. ముఖ్యంగా అనుబంధ యాప్ అయిన వాట్సాప్ సర్వర్ల సామర్థ్యం పెంచినట్లు స్పష్టం చేసింది.
"ఫేస్బుక్, వాట్సాప్ చక్కగా, సజావుగా పనిచేసేలా చూసేందుకు మా టీమ్స్ చాలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్న ప్రజలు ఇలాంటి సమయంలో అంతరాయంలేని సేవలు కోరుకుంటారు."- మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్బుక్ సీఈఓ