అసత్య సమాచార వ్యాప్తిని నివారించి, నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ మరో ముందగుడు వేసింది. నకిలీవిగా తేలిన దాదాపు 540 కోట్ల అకౌంట్లను ఈ ఏడాది రద్దు చేసినట్లు పేర్కొంది. నకిలీ ఖాతాలను సృష్టించడానికి చేసే ప్రయత్నాలను పసిగట్టే పద్ధతులను మెరుగుపర్చుకున్నట్లు 'పారదర్శకత నివేదిక'లో ఫేస్బుక్ స్పష్టం చేసింది.
సమాచారం ఎక్కడినుంచి ఉత్పన్నమవుతుందనేది తెలియని విధంగా వినియోగదారులను మభ్య పెట్టే ఖాతాలను అరికట్టడం సహా రాజకీయ, సామాజిక అజెండాలతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని అరికట్టడానికి ఫేస్బుక్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.
'నకిలీ ఖాతాలను నిలువరించడంలో ప్రగతి సాధించినందుకు సంతృప్తిగా ఉంది. ఈ సాంకేతికతలు పరిపూర్ణంగా లేవు. తప్పులు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అందువల్లే కచ్చితత్వాన్ని పెంపొందించడం సహా మా నిబంధనలకు వ్యతిరేకంగా సమాచార వ్యాప్తి చేస్తున్న ఖాతాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాం.'
-ఫేస్బుక్