భూతాపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు కరవుతో కొట్టుమిట్టాడుతున్నారు. తాగడానికి ఒక్క చుక్క నీరు లేక విలవిలలాడుతున్నారు. అమెరికా కాలిఫోర్నియాలో పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయి(california drought 2021). గడ్డు కాలం నుంచి బయటపడేందుకు ఎదురుచూస్తున్న నగరవాసులను ఓ కొత్త సాంకేతికత పలకరించింది. గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఈ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు(water from air machine).
సునామీ ప్రోడక్ట్స్ అనే సంస్థ ఈ యంత్రాన్ని రూపొందించింది. ఇది ఒక ఏసీలానే పనిచేస్తుంది. కాయిల్స్‌ను ఉపయోగించుకుని చల్లటి గాలిని నీటిగా మారుస్తుంది. యంత్రానికి అమర్చిన బేసిన్ ద్వారా నీరు శుద్ధి అవుతుంది.
"గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేయడమనేది మ్యాజిక్ కాదు. అది సైన్స్. ఈ యంత్రాలతో దానిని నిజం చేసి చూపిస్తున్నాం. గాలిని డీహ్యూమిడిఫై చేస్తాము. అలా తాగడానికి నీరు ఉత్పత్తి అవుతుంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో ఉపయోగించేలా, సైనిక అవసరాలు తీర్చేలా ఈ యంత్రాన్ని రూపొందించాలని అనుకున్నాము. చాలా కరెంట్ అవసరం అవుతుంది. ఖర్చు గురించి పట్టించుకోలేదు. తాగడానికి నీరు వస్తే చాలనుకున్నాము. ఆ తర్వాత మాకు ఒక విషయం అర్థమైంది. మంచి నీరు అవసరం ఉన్నా, ఆ అవసరం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. అందువల్ల పరిశోధనను ఆపేశాము. భారీ మొత్తంలో నీటిని ఉత్పత్తి చేయాలన్న ఆలోచనను విరమించుకుని, తక్కువే అయినా, సమర్థవంతమైన, అవసరానికి సరిపడా వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాము."
--- టెడ్ బౌమన్, డిజైన్ ఇంజినీర్.