తెలంగాణ

telangana

ETV Bharat / international

ISIS Kabul Attack: ఏంటీ ఐసిస్​-కే? తాలిబన్లకు శత్రువా? - అఫ్గానిస్థాన్​

రెండు దశాబ్దాలకుపైగా అమెరికా నేతృత్వంలోని బలగాలు అఫ్గానిస్థాన్​లో ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేశాయి. అయినప్పటికీ.. ఐసిస్​-కే(isis khorasan) ఉగ్రసంస్థ తన కార్యకలాపాలను కొనసాగించగలిగింది. తాజాగా అఫ్గాన్​ నుంచి అమెరికా, నాటో దళాల ఉపసంహరణతో దేశాన్ని తాలిబన్లు ఆక్రమించారు. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చి భారీ ఉగ్రదాడికి(kabul airport blast) పాల్పడింది ఐసిస్​-కే. ఇంతకీ ఈ సంస్థ ఎప్పుడు ఆవిర్భవించింది? తాలిబన్లు, ఐసిస్​-కే మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా?

Islamic State
ఐసిస్​-కే చరిత్ర ఏంటి?

By

Published : Aug 27, 2021, 2:58 PM IST

కాబుల్ విమానాశ్రయం వద్ద జంట ఆత్మాహుతి పేలుళ్లకు(kabul airport blast) పాల్పడింది తామే అని ప్రకటించింది ఐసిస్​-కే(isis-k attacks) ఉగ్రసంస్థ. ఈ ఘటనలో 100కుపైగా ప్రాణాలను బలిగొన్న ఈ సంస్థ ఎప్పుడు, ఎలా పుట్టింది? తాలిబన్లకు, ఈ వర్గానికి అస్సలు పడదా? వారి మారణహోమం వెనుక ఉద్దేశం ఏంటి? భవిష్యత్తులో ప్రపంచానికి పెను ముప్పుగా ఈ తీవ్రవాద సంస్థ పరిణమిస్తుందా? అనే సందేహాలకు అమెరికా ఉగ్రవాద నిర్మూలన నిపుణులు అమిరా జదూన్, ఆండ్రూ మైన్స్ సమాధానాలిచ్చారు. గత కొన్నేళ్లుగా ఐసిస్​-కే కార్యకలాపాలను వీరు నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఐసిస్​-కే అంటే?

ఐసిస్​-కే అంటే ఇస్లామిక్ స్టేక్​ ఖోరసన్​ ప్రావిన్స్(isis khorasan). దీన్నే ఐసిస్​-కే, ఐసిస్​కేపీ, ఐఎస్​కే అని కూడా పిలుస్తుంటారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్​ ఇరాక్​, సిరియా(ఐసిస్​​) ఉగ్రసంస్థకు ఇది అనుబంధ సంస్థ. 2015 జనవరిలో ఐసిస్​-కేను స్థాపించారు. అతి తక్కువ కాలంలో ఉత్తర, ఈశాన్య అఫ్గాన్​లోని గ్రామీణ జిల్లాలు సహా ప్రాదేశిక నియంత్రణను ఏకీకృతం చేసింది. మొదటి మూడేళ్లలో అఫ్గాన్, పాకిస్థాన్​లోని మైనారిటీ వర్గాలు, ప్రభుత్వ సంస్థలు లక్ష్యంగా దాడులతో రెచ్చిపోయింది. 2018 నాటికే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ఉగ్రసంస్థల్లో నాలుగో స్థానంలో నిలిచింది.

అయితే అమెరికా నేతృత్వంలోని అప్గాన్​ దళాలు దాడులు చేయడం వల్ల ఐసిస్-​కేకు తీరని నష్టం వాటిల్లింది. ఈ సంస్థ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 1400 మంది అఫ్గాన్ ప్రభుత్వం ముందు 2019-2020 మధ్య కాలంలో లొంగిపోయారు.

ఎవరు స్థాపించారు?

పాకిస్థానీ తాలిబన్​ మాజీ సభ్యులు, అఫ్గాన్ తాలిబన్​, ఉజ్బేకిస్థాన్​ ఇస్లామిక్​ ఉద్యమకారులు ఐసిస్​-కేను(isis-k leadership) స్థాపించారు. కాలక్రమేణా ఇతర మిలిటెంట్ గ్రూప్​లకు చెందిన వారిని కూడా కలుపుకొంటూ వెళ్లారు.

స్థానికంగా అత్యంత నైపుణ్యం, శక్తిసామర్థ్యాలు కలిగిన కమాండర్లు, సభ్యులు ఉండటం ఈ సంస్థ బలం. ఐసిస్​-కే మొదట నంగరర్హర్​ ప్రావిన్సు దక్షిణాది జిల్లాలను తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. అఫ్గాన్ ఈశాన్య సరిహద్దు పాకిస్థాన్​ సరిహద్దు కలిసే ఇక్కడి టోరా బోరా ప్రాంతపై గతంలో అల్​ఖైదాకు మంచి పట్టుండేది. ఈ సరిహద్దు నుంచే తమకు కావాల్సిన వాటిని పొందేది. పాకిస్థాన్​ గిరిజన ప్రాంతాల నుంచి నియామకాలు చేపట్టి తమ గ్రూప్​లో చేర్చుకునేది.

ఇస్లామిక్ స్టేట్​ నుంచే ఐసిస్​-కేకు ఆర్థిక సాయం, సలహాలు-సూచనలు, శిక్షణా సహకారం అందేవని ఆధారాలున్నాయి. నిపుణుల ప్రకారం ఈ సంస్థకు ఐసిస్​ నుంచి దాదాపు 100 మిలియన్ డాలర్లు సమకూరాయి.

ఐసిస్​-కే లక్ష్యమేంటి?

ఇస్లామిక్ స్టేట్ ఉద్యమాన్ని మధ్య, దక్షిణాసియాకు విస్తరించడమే ఐసిస్​-కే లక్ష్యం. దీని కోసం ప్రధాన కేంద్రాన్ని నెలకొల్పాలని భావిస్తోంది. జిహాదీ సంస్థల వారసత్వాన్ని స్వాధీనం చేసుకుని తామే అగ్రగామిగా అవతరించేందుకు ఐసిస్​-కే ప్రయత్నిస్తోంది. అందుకే తమతో కలసిరావాలని వెటరన్ జిహాదీ ఫైటర్లు, పట్టణ ప్రాంతాల్లోని యువతకు సందేశాలు పంపుతోంది. ఇతరు గ్రూప్​లతో కలిసి అఫ్గాన్​(isis-k afghanistan)లోని హజారాలు, సిక్కులు, జర్నలిస్టులు, భద్రతా సిబ్బంది లక్ష్యంగా విధ్వంసకర దాడులకు పాల్పడుతోంది. ప్రజలకు ప్రభుత్వం భద్రత కల్పించలేదనే భావన తీసుకువచ్చేలా, ఇతర గ్రూప్​ల వారు తమతో చేరేలా భయభ్రాంతులు, అస్థిరత సృష్టించడమే ఐసిస్​-కే లక్ష్యం.

తాలిబన్లతో ఐసిస్​-కే సంబంధాలు ఎలా ఉంటాయి?

తాలిబన్ల(taliban latest news)ను ఐసిస్​-కే వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుంది. వారిని కేవలం అధికారం కోసం పరితపించే 'హీనమైన జాతీయవాదులు'గా భావిస్తుంది. ఇస్లామిక్ స్టేట్ ఉద్యమ లక్ష్యానికి తాలిబన్లు విరుద్ధమని వారిని శత్రువులుగానే పరిగణిస్తుంది.

తాలిబన్లపై దాడులకు దిగుతూనే(isis in afghanistan) వారిని తమలో చేర్చుకునేందుకు ఐసిస్​-కే ప్రయత్నించింది. ఈ విషయంలో కొంత సఫలీకృతమైనప్పటికీ, తాలిబన్లు ప్రతిదాడులకు దిగి ఐసిస్​-కేను కొంతవరకు దెబ్బతీశారు.

అఫ్గాన్​కు, అంతర్జాతీయ సమాజానికి ఎంత ప్రమాదకరం?

బలహీనంగా ఉన్న తమ సంస్థను బలపరచుకోవడమే ఐసిస్​-కే తక్షణ కర్తవ్యం. అందుకే హై-ప్రొఫైల్ దాడులు జరపాలని భావించవచ్చు. అమెరికా సహా దాని మిత్రదేశాలపై దాడులు చేసేందుకు ఆసక్తికనబరవచ్చు. అయితే ఐసిస్​-కే అమెరికా(US vs isis)పై ప్రత్యక్ష దాడులు జరిపేంత శక్తి సామర్థ్యాలున్నాయా అనే విషయంపై ఆ దేశ సైన్యం, నిఘా విభాగంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

అయితేే ఐసిస్​-కే వల్ల అప్గాన్​కు మాత్రం పెద్ద ముప్పే పొంచి ఉంది. మైనారిటీలు, ప్రభుత్వ సంస్థలపై దాడులు ఎక్కువ జరగవచ్చు. ఈ ఏడాది కాబుల్​లో అమెరికా రాయబారిని చంపేందుకు కూడా ఈ సంస్థ ప్రయత్నించింది.

అఫ్గాన్​ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవాలనే అమెరికా(us withdrawal from afghanistan) నిర్ణయం.. ఐసిస్​-కేకు ఎంత మేర ప్రయోజనం చేకూర్చుతుందో ఇప్పుడే చెప్పడం కష్టమని నిపుణులు అంటున్నారు. భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను కొనసాగిస్తుందని తెలిపారు. కాబుల్​ విమానాశ్రయంపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనమన్నారు. తాలిబన్లు అఫ్గాన్​కు భద్రత కల్పించరని ఐసిస్ నిరూపించాలనుకుంటుందని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details