ఇంకో రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. యావత్ ప్రపంచం అగ్రరాజ్య ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డెమొక్రాట్ల అభ్యర్థి బైడెన్ గెలుస్తారా? డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్లే మళ్లీ అధికారంలోకి వస్తారా? అనే విషయంపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. అయితే అమెరికాలో మునుపెన్నడూ లేని పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలను కొందరు అసాధారణమైనవని అభివర్ణిస్తుంటే, మరికొందరేమో 'అత్యంత చెత్త ఎన్నికలు' ఇవే అని అభిప్రాయపడుతున్నారు.
2020 అధ్యక్ష ఎన్నికలకు గెలుపోటములతో సంబంధం లేకుండా చిరస్థాయిగా గుర్తుండిపోయే కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవేంటో చూద్దాం.
మొదటిసారి..
- అమెరికాలోని ఓ ప్రధాన పార్టీ.. నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి.
- అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడే ఇద్దరి అభ్యర్థుల వయసు 70ఏళ్లు దాటడం కూడా ఇదే మొదటిసారి.
- దేశంలోని ప్రతిమూలకూ ప్రాణాంతక వైరస్ విస్తరించిన పరిస్థితుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడమూ ఇదే ప్రథమం.
ఇదీ చూడండి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఇంత సంక్లిష్టమా?
1918 తర్వాత..
స్పానిష్ ఫ్లూ విజృంభించినప్పుడు 1918లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పోలింగ్ శాతం ఏకంగా 20 శాతం తగ్గింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 20 లక్షల మంది పాల్గొనడం కూడా ఓటింగ్ శాతం తగ్గడానికి మరో కారణం. ఆ తర్వాత 1920 ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి వారెన్ జీ హార్డింగ్ విజయం సాధించారు. ఫ్లూ ముప్పును అమెరికా అధిగమించింది.
ముందస్తు ఓటింగ్..
కరోనా నేపథ్యంలో ఊహించని మార్పుతో ఈ ఎన్నికల్లో బ్యాలెట్ ఓటింగ్‌కు ముందుగానే అనుమతించింది ప్రభుత్వం. దీంతో తుది ఫలితాలు రావడానికి పలు వారాల ముందే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.