'అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై రెండోసారి అభిశంసన..' ఈ వార్త విన్నవారెవరికైనా ఓ సందేహం కలుగుతుంది. 'అధ్యక్షుడిగా చివరి రోజుల్లో ఉన్న ట్రంప్‌పై అభిశంసించడం అవసరమా?' అని అనుకుంటారు. అయితే ఇందుకు డెమొక్రాట్లు ఓ సమాధానం ఇచ్చారు. ఈ అభిశంసన.. తదుపరి తరాలకు ఓ హెచ్చరికలా ఉంటుందన్నారు. కానీ డెమొక్రాట్లు కేవలం అభిశంసనతో ఆగేట్టు కనిపించడం లేదు. అధికారం చేపట్టకుండా ట్రంప్‌పై శాశ్వత వేటు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు మరో అవకాశం ఉన్న ట్రంప్‌ను అడ్డుకునేందుకు డెమొక్రాట్ల వద్ద ఉన్న అస్త్రాలేవీ?
అసలు అభిశంసన అస్త్రం నెగ్గుతుందా?
ప్రతినిధుల సభ.. ట్రంప్‌పై అభిశంసను బుధవారం అమోదించింది. అయితే అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించాలంటే.. సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీతో అభిశంసన తీర్మానం గట్టెక్కాలి. 2019లో ట్రంప్‌పై వేసిన అభిశంసన.. సెనేట్ను దాటడంలో విఫలమైంది. సెనేట్‌లో రిపబ్లికన్లు మెజారిటీగా ఉండటమే ఇందుకు కారణం. అప్పుడు కేవలం ఒకే ఒక్క రిపబ్లికన్(మిట్ రామ్నీ) ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇదీ చూడండి:-అనిశ్చితి, ఆంక్షల నడుమ బైడెన్ ప్రమాణం!
అయితే ఈసారి పరిస్థితులు మారే అవకాశముంది. క్యాపిటల్ హింసకు ప్రేరేపించారన్న కారణంగా ట్రంప్‌పై అనేక మంది రిపబ్లికన్లు ఆగ్రహంతో ఉన్నారు. ప్రస్తుత సమీకరణలను దృష్టిలో పెట్టుకుంటే.. ట్రంప్‌పై వేసిన అభిశంసన సెనేట్ను దాటడానికి 17మంది రిపబ్లికన్ల ఓట్లు అవసరం.
అభిశంసనకు గురైతే శాశ్వత వేటు పడినట్టేనా?
లేదు. అధ్యక్ష కార్యాలయం నుంచి ఓ అధ్యక్షుడిని శాశ్వతంగా తొలగించాలంటే.. వేరే ప్రక్రియ ఉంటుంది. అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఏ అధ్యక్షుడిపైనా శాశ్వత వేటు పడలేదు.
అయితే పలువురు న్యాయమూర్తులపై శాశ్వత వేటు పడింది. వారిని తొలగించేందుకు.. అభిశంసన అనంతరం మరోమారు ఓటింగ్ నిర్వహించారు.
ఇదీ చూడండి:-'ఆ దాడి చేసింది నా మద్దతుదారులు కాదు'
ఈ ప్రక్రియ ద్వారా ట్రంప్‌ను తొలగిస్తే.. ఆయన న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.