ప్రపంచ దేశాలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. నవంబర్ 3న 'ఎలక్షన్ డే' కోసం అమెరికా సిద్ధమవుతోంది. ఇంతకీ... ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా సాగుతుంది? ప్రపంచాన్ని శాసించే 'విజేత'ను ఎప్పుడు ప్రకటిస్తారు?
పరోక్ష ఎన్నిక...
ఓట్ల లెక్కింపునకు ముందు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ గురించి తెలుసుకోవాలి. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయి. అంటే.. ప్రజలు ప్రత్యక్షంగా అధ్యక్షుడిని ఎన్నుకోరు. ఎన్నికల కోసం ఆయా పార్టీలు నియమించిన ఎలక్టార్లకు ప్రజలు ఓట్లు వేస్తారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన అనంతరం వీళ్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మొత్తం 538 మంది ఎలక్టార్లు ఉంటారు. 270 అంతకన్నా ఎక్కువ మంది ఎలక్టార్లను గెల్చుకున్న పార్టీ అభ్యర్థే అధ్యక్షుడవుతారు.
ఓటింగ్ ఇలా...
భారత్‌లో ప్రజలు ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ అగ్రరాజ్య ప్రజలు ఓటు వేసేందుకు సహజంగా రెండు విధానాలుంటాయి.
- ఎన్నికల రోజు ఓటింగ్
- ముందస్తు పోలింగ్
ఎన్నికల రోజు.. అంటే నవంబర్ 3న పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.
ఇదీ చూడండి:-అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!
ముందస్తు పోలింగ్‌లోనూ రెండు విధానాలు ఉంటాయి.
- మెయిల్ ఇన్ బ్యాలెట్ (పోస్టల్ బ్యాలెట్)
- ముందుగానే పోలింగ్ కేంద్రాలను తెరవడం
మెయిల్ ఇన్ బ్యాలెట్ అంటే.. ప్రజలు తమ ఓట్లను ఓ ఎన్వలప్లో పెట్టి పంపిస్తారు. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాలు ఎన్నికల రోజు తర్వాత కొన్ని వారాల పాటు కూడా ఈ మెయిల్ ఇన్ పోస్ట్‌లను స్వీకరిస్తాయి. అయితే ఇక్కడ ఓ షరతు ఉంది. ఆ పోస్ట్‌ల మీద ఎన్నికల తేదీ ఉంటేనే వీటిని పరిగణిస్తారు.
ఇదీ చూడండి:-ఈ రాష్ట్రాలు ఎటువైపు 'స్వింగ్' అవుతాయి?
మరోవైపు ఎన్నికల రోజు ముందే.. ముందస్తు పోలింగ్ కోసం ఏర్పాటు చేసిన కేంద్రాలకు ప్రజలు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. సహజం ఇది ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు నెలల ముందు నుంచే పోలింగ్ కేంద్రాలను తెరిస్తే... మరికొన్ని ఎన్నికల ముందు తెరుస్తాయి.
ఎలా లెక్కిస్తారు?
అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఎంత సంక్లిష్టమో.. ఓట్ల లెక్కింపు కూడా అంతే క్లిష్టం. ఈ ప్రక్రియ సహజంగా చాలా రోజులు పడుతుంది. అయితే.. ఎన్నికలు జరిగిన తర్వాతి రోజే విజేత ఎవరనేది ఓ స్పష్టత వస్తుంది.
మెయిల్- ఇన్ ఓట్ల లెక్కింపు...
మెయిల్ ద్వారా వచ్చిన ఓట్లను లెక్కించేందుకు చాలా సమయం పడుతుంది. ప్రతి ఓటు మీద ఓటరు సంతకం ఉండాలి. రిజిస్ట్రేషన్ కార్డులో ఉన్న సంతకంతో ఇది పోలి ఉండాలి. ఇవన్నీ చూసేసరికి ఆలస్యమవుతుంది.