ట్రంప్ అంతే.. కింద పడ్డా.. పైచేయి నాదే అంటారు. ప్రపంచమంతా ఓ కోణంలో చూసే దానిని ట్రంప్ మాత్రమే వేరే కోణంలో చూస్తారు. తాజాగా ఇలాంటి మాటల విన్యాసాన్ని మరోసారి ప్రదర్శించారు.
ఆఫ్రో-అమెరికన్లపై దాడులకు వ్యతిరేకంగా శుక్రవారం శ్వేతసౌధం ఎదుట భారీగా ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది రహస్య బంకర్‌లోకి తరలించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ట్రంప్ తన ధైర్యంపై మచ్చగా దానిని భావించారు. తాజాగా దానికి సంబంధించి మాట్లాడుతూ.. "నేను అక్కడ చాలా తక్కువ సేపు ఉన్నాను. అది కూడా పగటి పూట. గతంలో రెండుమూడు సార్లు అక్కడకు వెళ్లాను కూడా. బయట ఏమేం రాశారో కూడా చదివాను. అక్కడకు వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు. అయినా, నా సమీపంలోకి వచ్చి ఎవరూ సమస్యలు సృష్టించలేరు" అని ఫాక్స్ న్యూస్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.