విదేశీ విద్యార్థులకు ఇచ్చే వీసాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన విభాగాన్ని కోరింది సెనేటర్ల బృందం. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌కు లేఖ రాశారు 24 మంది సెనేటర్లు. వారి లేఖతో వీసాల జారీ ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
దీని ద్వారా అమెరికాలో చదువుకోవాలనుకునే వేలాది మంది భారతీయ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. దిల్లీలోని అమెరికా ఎంబసీలో కేవలం అత్యవసర వీసాలు మాత్రమే జారీ చేస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోయే ప్రమాదంలో పడ్డారు.
"కొవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకుంటున్నప్పటికీ విదేశీ విద్యార్థుల వీసా ప్రక్రియ మందకొడిగా సాగటంపై మా ఆందోళనను తెలియజేస్తూ లేఖ రాశాం. వెంటనే విదేశీ విద్యార్థులను స్వాగతించాలి. స్థిరమైన కాన్సులర్ సేవలను అందించాలని విదేశాంగ శాఖను కోరుతున్నాము. భౌతిక ఇంటర్వ్యూలకు.. వర్చువల్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను పెంచాలి. వీసా అర్హత మినహాయింపులను పొడిగించాలి. అధికారిక సిబ్బంది ఎక్కువ సమయం పని చేస్తూ.. వీసాలు జారీ చేయాలి. విదేశీ ఏజెన్సీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసేలా ప్రయత్నాలు చేపట్టాలి. మనం విద్యా సంవత్సరంలో క్లిష్టమైన స్థానంలో ఉన్నాం. విదేశీ విద్యార్థులకు తప్పనిసరిగా వీసాలు ఇవ్వాలి. వారు అమెరికా వచ్చేలా ప్రణాళికలు రచించాలి."
- సెనేటర్ల బృందం.
విదేశాల్లోని అమెరికా కాన్సులెట్లు కొన్ని తెరుచుకుంటున్నప్పటికీ, చాలా తక్కువ సిబ్బందితో సేవలందిస్తున్నాయని గుర్తు చేశారు సెనేటర్లు. దాంతో విద్యార్థులు పరిమితంగానే వీసాలు పొందగలుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాకు రావటం వల్ల దేశ ఉన్నత విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు కీలకంమన్నారు.
అంతర్జాతీయ విద్యావంతుల అసోసియేషన్ డేటా ప్రకారం 2018-19 అకాడమిక్ ఏడాదిలో 10 లక్షల మందికిపైగా విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. అది అమెరికా ఆర్థిక వ్యవస్థకు 41 బిలియన్ డాలర్లను సమకూర్చింది. అందులో లక్ష మందికిపైగా భారతీయ విద్యార్థులే ఉండటం గమనార్హం.
నికారగువా ప్రభుత్వ ప్రతినిధుల వీసాలపై ఆంక్షలు
నికారగువా అధ్యక్షుడు డేనియల్ ఒర్టెగా అణచివేత పాలనలో భాగమైన 50 మంది ప్రముఖులపై అమెరికా వీసా ఆంక్షలు విధించింది. అందులో చట్టసభ్యులు, న్యాయవాదులు, జడ్జీలు కూడా ఉన్నారు. గత రెండు నెలలుగా.. ముప్పై మందికిపైగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసింది ఒర్టెగా ప్రభుత్వం. అందులో ఏడుగురు అధ్యక్ష రేసులోని నేతలు ఉన్నారు. ఈ ఏడాది నవంబర్ 7న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఒర్టెగా మళ్లి గెలిచి నాలుగో సారి అధికారం చేపట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీ ఉపాధ్యక్షుడిని గృహనిర్బంధం చేసింది ప్రభుత్వం. ప్రతిపక్ష నేతలకు ప్రజల మద్దతు లభిస్తుందనే కారణంగానే అణచివేతకు పాల్పడుతున్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
ఇదీ చూడండి:హెచ్-1బీ ఆశావహులకు అమెరికా మరో లక్కీ ఛాన్స్!