అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ఏప్రిల్ నాటికి అమెరికాలోని అందరికీ టీకా పంపిణీ అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్‌ను ఆమోదించిన వెంటనే ప్రభుత్వం.. అమెరికన్లందరికీ టీకాను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. ప్రతి నెల కోటీ డోసులు సిద్ధమవుతాయని పేర్కొన్నారు.
అమెరికాలోని వైద్యులు, శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వీలైనంత త్వరగా టీకాను అభివృద్ధి చేయాలి. అప్పుడే జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకురావటానికి వీలవుతుంది. వ్యాక్సిన్ ద్వారా మిలియన్ల మంది జీవితాలను కాపాడవచ్చు.