భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్-2. ఈ ప్రయోగ తుది దశ అయిన విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో నాసా సహా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలకు చెందిన అంతరిక్ష పరిశోధకులు చంద్రయాన్-2 ల్యాండింగ్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రయాన్-2 విజయవంతమైతే జాబిల్లిని గురించి అనేక విషయాలు బయటకు వస్తాయని... చంద్రుడి భౌగోళిక స్థితిపై మరింత అవగాహన వస్తుందని శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
అమెరికన్ల కోసం భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక లైవ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసింది. నాసా శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.
"చంద్రయాన్-2 ల్యాండ్ అయ్యే ప్రదేశం పూర్తిగా నూతనమైనది. ఆర్బిటార్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ గురించి చాలా ఉత్సాహంగా ఎదురుటచూస్తున్నా. ఇది జాబిల్లి ఉపరితలంపై విస్తృతమైన తరంగధైర్ఘ్యాల మీద ప్రతిబింబించే కాంతిని మ్యాప్ చేస్తుంది. ఈ ప్రక్రియ ఉపరితలంపై నీటిని గుర్తించేందుకు, గణనకు ఉపకరిస్తుంది."
- బ్రెట్ డేనేవి, శాస్త్రజ్ఞురాలు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం
జాబిల్లికి సంబంధించిన పలు కీలక అంశాలను చంద్రయాన్-2 వెలికి తీయనుందని అభిప్రాయపడ్డారు నాసా శాస్త్రవేత్త డేవ్ విలియమ్స్. కక్ష్య నుంచి విస్తృతంగా చంద్రుడిని సర్వే చేశామని... కానీ వాస్తవానికి అక్కడ తమకు ఏమీ లభ్యం కాలేదని స్థానిక మీడియాతో స్పష్టం చేశారు.