ఆసియా మార్కెట్లలో ఉత్సాహం- అమెరికా సూచీలు పతనం - కరోనా వార్తలు
చమురు ధరలు పుంజుకోవడం కారణంగా ఆసియా మార్కెట్లు నేడు తిరిగి లాభాలను నమోదు చేశాయి. చమురు ధరలు పెరిగినా.. కరోనా భయాలు మాత్రం మార్కెట్లను ఇంకా వెంటాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు మాత్రం సోమవారం భారీగా నష్టపోయాయి. ఫలితంగా ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
లాభాల్లో ఆసియా మార్కెట్లు
By
Published : Mar 10, 2020, 5:27 PM IST
|
Updated : Mar 11, 2020, 11:45 AM IST
భారత్ మినహా ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు నేడు లాభాలను నమోదు చేశాయి. భారత మార్కెట్లు హోలీ సందర్భంగా సెలవులో ఉన్నాయి. చమురు ధరలు కాస్త పుంజుకోవడం మార్కెట్లకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా సూచీలన్నీ నేడు స్వల్పంగా లాభపడినప్పటికీ మదుపర్లను కరోనా వైరస్ భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.
కోవిడ్19 భయాలు సహా చమురు ధరల పతనం కారణంగా.. గత దశాబ్దంలోనే ఎన్నడూ చూడనంత భారీ నష్టాలను ఆసియా మార్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో నమోదు చేసిన విషయం తెలిసిందే.
చమురు వృద్ధి..
చమురు ధరలు దాదాపు 8 శాతం వృద్ధి చెందిన నేపథ్యంలో ఆసియాలో ప్రధాన మార్కెట్లకు సానుకూలత పెరిగింది.
జపాన్ సూచీ నిక్కీ 0.9 శాతం, షాంఘై సూచీ 1.8 శాతం, హాంకాంగ్ సూచీ 2 శాతం మేర నేడు లాభపడ్డాయి.
సిడ్నీ సూచీ 3 శాతానికిపైగా, సింగపూర్, ఇండోనేసియా, బ్యాంకాక్ సూచీలు 2 శాతానికిపైగా లాభాలను ఆర్జించాయి. మనీలా, తైపీ, సియోల్ సూచీలూ స్వల్ప లాభాలను నమోదు చేశాయి. న్యూజిలాండ్ సూచీ 1.8 శాతం మేర లాభపడింది.
గల్ఫ్‌లోనూ ఉత్సాహం..
గల్ఫ్‌లో ప్రధాన సూచీలూ నేడు పుంజుకున్నాయి. దుబాయ్ సూచీ ఏకంగా 5.5 శాతం మేర లాభపడింది. అబుదాబి 4.2 శాతం, కువైట్, ఖతర్ సూచీలు స్వల్పంగా వృద్ధి చెందింది.
కరోనా వైరస్‌కు ప్రధాన కేంద్రంగా భావిస్తున్న చైనాలోని ఉహాన్ నగరంలో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పర్యటించినట్లు వార్తలు వెలువడ్డాయి. చైనాలో కొవిడ్ 19 ప్రభావం తగ్గుముఖం పట్టిందనేందుకు ఈ వార్తలు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా చైనా త్వరలోనే తిరిగి కోలుకుంటుందనే ఆశలు చిగురించాయి. ఈ అంశమూ ఆసియా మార్కెట్లలో ఉత్సాహం నింపింది.
అమెరికా మార్కెట్లు ఢమాల్..
చమురు ధరల పతనం, కరోనా భయాలతో ఆమెరికాలోని ప్రధాన మార్కెట్లన్ని సోమవారం దాదాపు 7 శాతం మేర నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఈ కారణంగా దాదాపు 15 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేయాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. సూచీలన్ని ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత భారీ నష్టాన్ని నమోదు చేసినట్లు నిపుణులు తెలిపారు.