కరోనా మహమ్మారి కారణంగా ప్రజల్లో విద్వేష భావం, విదేశీయులపట్ల భయం విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. అందరూ కలిసికట్టుగా ముందుకుసాగి కరోనాతోపాటు 'విద్వేష సునామీ'నీ ఓడించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో గతేడాదే ఐరాస ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని గుర్తుచేశారు గుటెరస్.
" వైరస్ నుంచి ప్రజలను రక్షించటం మన లక్ష్యం. అలానే ప్రజలు ఇతరులను దోషులుగా చూసే భావాన్ని, హింసకు పాల్పడే దృక్పథాన్ని నిర్మూలించటం మన కర్తవ్యం. కొవిడ్-19ను, విద్వేషాన్ని కలిసికట్టుగా ఓడిద్దాం. కరోనా.. మనం ఎవరు, ఎక్కడ నివసిస్తున్నాం, దేనిని నమ్ముతాం వంటి విషయాలను పట్టించుకోదు. దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిఒక్కరి మద్దతు అవసరం. ఇప్పటికీ ఈ మహమ్మారి ద్వేషాన్ని, విదేశీయుల పట్ల భయాన్ని పెంచుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి వ్యాపించడం వల్ల విదేశీ వ్యతిరేక భావన ఆన్లైన్లోనూ పెరిగింది. యాంటీ-సెమిటిక్ కుట్ర సిద్ధాంతాలు వ్యాపించాయి. వలసదారులు, శరణార్థులను వైరస్ వ్యాప్తికి కారకులుగా పరిగణిస్తున్నారు. వారు అలా వివక్షకు గురవటమే కాక.. సరైన వైద్యం పొందలేకపోతున్నారు."
– ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి.
సామాజిక సమైక్యతను పెంపొందించేందుకు పాటుపడాలని రాజకీయ నాయకులకు సూచించారు గుటెరస్. వార్తా సంస్థలు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు.. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి అనుగుణంగా జాత్యహంకారం, మహిళలపై ద్వేషం వంటి ఇతర హానికర అంశాలు లేకుండా చూడాలని కోరారు.