తెలంగాణ

telangana

ETV Bharat / international

'46 రోజులుగా ఇంట్లోనే ఉన్నాం.. ఇక చాలు' - visitors are turn to parks in china and us

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ ఆంక్షల్ని ఇప్పటికే కొన్ని దేశ ప్రభుత్వాలు సడలించగా.. మరికొన్ని ఆ దిశగా కార్యచరణ సిద్ధం చేస్తున్నాయి. రోజుల తరబడి ఇంట్లోనే ఉన్న చైనా, అమెరికా, స్పెయిన్​ సహా మరికొందరు దేశస్థులు.. ఆంక్షల సడలింపుతో పర్యటక కేంద్రాలకు క్యూ కడుతున్నారు. పార్కుల్లో వ్యయామాలు చేస్తూ సందడిగా కనిపిస్తున్నారు. మరోవైపు చైనాలో శనివారం కొత్తగా 14 మందికి కొవిడ్​-19 పాజిటివ్​గా తేలింది. అటు పాకిస్థాన్​లోనూ వైరస్​ కేసులు 19వేలు దాటాయి. సింగపూర్​లోనూ 18వేల మార్కును దాటాయి.

Emerging from lockdown: '46 days in the house was enough'
'46 రోజులుగా ఇంట్లోనే ఉన్నాం.. ఇక చాలు'

By

Published : May 3, 2020, 3:04 PM IST

ప్రపంచానికే పెనుముప్పుగా మారిన కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమెరికా, యూరప్, ఆసియా ఖండాల్లోని ఎన్నో దేశాలు లాక్​డౌన్​ను అమలు చేశాయి. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నందున చాలా దేశాల ప్రభుత్వాలు లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తున్నాయి. ​ఈ నేపథ్యంలో రోజులు తరబడి ఇంట్లోనే ఉన్న ప్రజలు పర్యటక కేంద్రాలను సందర్శించేందుకు వరుస కడుతున్నారు. చైనాలో కేవలం రెండు రోజుల్లోనే దాదాపు 17లక్షల మంది బీజింగ్​ పార్కుల్లో చక్కర్లు కొట్టారు.

చైనాలో పర్యటక కేంద్రాల వద్ద స్థానికుల సందడి

అటు అమెరికన్లు కూడా.. "46 రోజులుగా ఇంట్లోనే ఉన్నాం ఇక చాలు" అన్న భావనను వినివిస్తున్నారు. న్యూయార్క్​ నగరంలోని సెంట్రల్​ పార్కు.. ఉదయం వ్యాయామం, జాగింగ్ చేసేవారితో​ నిండిపోయింది. న్యూజెర్సీలోనూ ఎన్నో పార్కులు సందర్శకులతో కళకళలాడుతున్నాయి.

మార్చి 14 నుంచి ఇళ్లకే పరిమితమైన స్పెయిన్​ వాసులు.. శనివారం మొట్టమొదటిసారిగా వీధుల్లో సందడి చేశారు.

సింగపూర్​లో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా 657 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలినందున.. సింగపూర్​లో మొత్తం కేసుల సంఖ్య 18,205కు చేరింది. అయినప్పటికీ మే 12 నుంచి కొన్ని వాణిజ్య కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.

మే 11 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కార్యకలాపాలు ప్రారంభించాలని శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

పార్కులో అమెరికన్ల సందడి

చైనాలో శనివారం 14 కేసులు

కరోనా పుట్టుకకు కేంద్ర బిందుమైన చైనాలో వైరస్​ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే అక్కడ రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గగా.. శనివారం 14 కొత్త కేసులు నిర్ధరణ అయినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ (ఎన్​హెచ్​సీ) ప్రకటించింది. ఇందులో ఇద్దరిలో మాత్రమే కొవిడ్​-19​ లక్షణాలున్నట్లు గుర్తించామని.. ఓ వ్యక్తి స్థానికుడు కాగా.. మరో వ్యక్తి విదేశాల నుంచి వచ్చాడని ఎన్​హెచ్​సీ పేర్కొంది. మిగతా 12 మందిలో లక్షణాలేమీ కనిపించనప్పటికీ.. వారికి వైరస్​ పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించింది. కరోనాతో కొత్తగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేసింది.

కొత్తగా వైరస్​ సోకిన 14 మందితో కలిపి చైనాలో ఇప్పటివరకు మొత్తం 82,877 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. 77,713 మంది మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం 531 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నాయి.

'6 నెలల నుంచి ఏడాది పాటు సహజీవనం'

పాకిస్థాన్​లో గడిచిన 24 గంటల్లో 989 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. వీటితో కలిపి పొరుగుదేశంలో మొత్తం కొవిడ్​-19 కేసులు 19వేలు దాటాయి. పాకిస్థాన్​లో ఇప్పటివరకు 19,103 మందికి వైరస్​ సోకగా.. 440 మంది మరణించారు. 4,817 మంది వైరస్​ బారినుంచి కోలుకున్నారు.

దేశంలో పెరుగుతున్న కేసులపై స్పందించారు పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​. "వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో తెలియదు. మరో 6 నెలల నుంచి ఏడాదిపాటు వైరస్​తో సహజీవనం చేయక తప్పదు" అని వ్యాఖ్యానించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details