తెలంగాణ

telangana

ETV Bharat / international

గుడ్డు తింటే గుండెకు ముప్పు!

రోజువారి ఆహారంలో గుడ్డు ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యం పాలయ్యే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. రోజూ ఒకటిన్నర గుడ్డు కంటే ఎక్కువ తీసుకుంటే గుండె జబ్బుల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.

గుడ్డుతో ముప్పు

By

Published : Mar 20, 2019, 8:03 AM IST

మీరు గుడ్డు తింటారా! మీ రోజువారీ ఆహారంలో గుడ్డు తప్పనిసరిగా ఉంటుందా! ఎక్కువ మోతాదులో తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముంది జాగ్రత్త. రోజూ ఒకటిన్నర గుడ్డు కంటే ఎక్కువ తింటే గుండె జబ్బులొచ్చే అవకాశముందని అమెరికా పరిశోధకులు తేల్చారు. దీనికి కారణం గుడ్డులో ఉండే కొవ్వు. దీని వల్ల తొందరగా మరణించే అవకాశమూ ఉందన్నారు నిపుణులు.

గుడ్డుతో ముప్పు

గుడ్డు పచ్చసొన, షెల్ చేపలు, మాంసం, పాల ఉత్పత్తుల్లో కొవ్వు ఉంటుందని తెలిపారు. రోజూ తినే గుడ్లపై అమెరికా ఫిన్​బర్గ్ వర్సిటీ నిపుణులు పరిశోధన చేశారు. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని, దీని వల్ల దీర్ఘకాలంలో హృద్రోగాల బారిన పడే ప్రమాదముందని చెప్పారు.

"ఆహారనియమాలు పాటిస్తున్న 30వేల మందిని పరీక్షించాం. 17ఏళ్ల తరువాత కొవ్వు కారణంగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆహారంలో గుడ్ల సంఖ్య తగ్గించుకోవాలి. రోజూ ఒకటిన్నర గుడ్డు తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 8 శాతం పెరుగుతుంది" -- నొరినా ఆలెన్, వర్సిటీ నిపుణులు

తాజా పరిశోధనతో రోజూ ఆహరంలో గుడ్లు మితంగా తీసుకోవాలని సూచించారు. పచ్చసొన మినహా మిగిలిన భాగాన్ని ఆహారంగా తీసుకుంటే మంచిదని ఫిన్​బర్గ్ వర్సీటీ పరిశోధకులు స్పష్టం చేశారు. ఆహారంలో గుడ్డు తప్పనిసరి అని భావించే వారు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details