పెరూ ఉత్తర పసిఫిక్ తీరాన్ని భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు భూప్రకంపనలు సంభవించాయని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సులానా నగరానికి తూర్పు దిశగా 8 కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపింది.
భూకంపం ప్రభావంతో సులానా నగరంలో చాలా మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లారు. ఓ గోడ కూలి కారుపై శిథిలాలు పడగా.. అందులో ఉన్న ఓ మహిళకు గాయాలయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన ఓ చర్చి పైకప్పులో కొంతభాగం కూలింది. ఇందుకు సంబంధించిన వీడియోలు.. స్థానిక టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యాయి. మరో రెండు ప్రార్థనా మందిరాలు సహా మూడు అగ్నిమాపక కేంద్రాలు కూడా ధ్వంసమైనట్లు ఆ వీడియోల్లో కనిపించాయి.