ఉరకలేసే ఉత్సాహం, ఈ ప్రపంచమంతటినీ జయించబోతున్నామనే ఆత్మవిశ్వాసం, భావి జీవితమంతటికీ అవసరమైన ధైర్యం, నైపుణ్యాలను ఒడిసి పట్టుకొంటూ ఆనందంగా ముందుకుసాగాల్సిన కౌమార దశ బాల్యంపై కారుమబ్బులు కమ్ముకొంటున్నాయి. భూ భారమంతటినీ తామే మోస్తున్నామన్న ఆవేదన.. లేలేత మోములపై మెరవాల్సిన చిరునవ్వులను కబళిస్తోంది. రెండు పదుల వయసుకు ముందే తీవ్ర నిర్ణయం తీసుకొనేలా పురిగొల్పుతోంది. ఇదే సమస్య ఇప్పుడు అంతటా ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలో ఏటా 45,800 మంది కౌమార వయస్సు(10-19ఏళ్లలోపు) పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారని యునిసెఫ్ వెల్లడించింది. ప్రతి 11 నిమిషాలకు ఒకరు బలవన్మరణానికి పాల్పడుతున్నారంటూ మానసిక సమస్యల తీవ్రతను మంగళవారం విడుదల చేసిన నివేదికలో కళ్లకు కట్టింది. నానాటికీ పెరిగిపోతున్న మానసిక రుగ్మతల వల్ల ప్రపంచ దేశాలు రూ.28.87 లక్షల కోట్ల విలువైన మానవ వనరులను నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్‌లో సమస్య తీవ్రత అధికంగా ఉందని తెలిపింది.
- 10-19 ఏళ్ల మధ్య వయస్సు పిల్లల్లో దాదాపు 13% మంది మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో 8.9 కోట్ల మంది బాలురు కాగా 7.7 కోట్ల మంది బాలికలు.
- మానసిక సమస్యలున్న పిల్లల్లో 40% మంది ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతున్నారు. మిగిలిన వారిలో ఏకాగ్రత లోపించడం, హైపర్ యాక్టివిటీ, బైపోలార్, ఆహారం తీసుకోవడంలో సమస్యలు, ఆటిజం, మేధోపరమైన లోపాలు, స్కిజోఫ్రినియా, ఇతర పర్సనాలిటీ డిజార్డర్స్ కనిపిస్తున్నాయి.
- 15-19 ఏళ్లలోపు బాలికల మరణాలకు ఆత్మహత్య మూడో ప్రధాన కారణమవుతోంది.
- సమస్యలను తోటి వారితో పంచుకొని వారి మద్దతు తీసుకోవడం మంచిదని 21 దేశాల్లోని 15-24 ఏళ్ల వయస్సు పిల్లలు అభిప్రాయపడ్డారు. మిగతా దేశాలతో పోలిస్తే ఈ విషయంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక్కడి పిల్లల్లో 41%మంది తమ ఇబ్బందులను సన్నిహితులతో పంచుకొని మద్దతు పొందగలుగుతున్నారు.
- ఈ 21 దేశాల్లో 15-24 ఏళ్ల వయస్సు వారిలో 19% మంది కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారు. భారత్‌లో ఇలాంటి వారు 14% మంది ఉన్నారు.
- మానసిక సమస్యల పరిష్కారానికి పెద్దఎత్తున మద్దతు కావాల్సి ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యరంగానికి చేసే ఖర్చులో 2.1% మాత్రమే ఇందు కోసం కేటాయిస్తున్నాయి. కొన్ని పేద దేశాలు ఒక్కో వ్యక్తి కోసం రూ.75 (డాలర్) కంటే తక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నాయి.
- చిన్నారులు, కౌమారదశ పిల్లల్లో మానసిక సమస్యలు పరిష్కరించే మానసిక నిపుణులు ప్రతి లక్ష మందికి 0.1 మంది కంటే తక్కువ ఉన్నారు. ధనిక దేశాల్లో ఈ సంఖ్య 5.5 వరకు ఉంది.
- బాల్యంలో పౌష్టికాహార లోపం, హింసకు గురవడంలాంటి అంశాలు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 29% మంది పిల్లలకు కనీస తిండి కరవైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 83% మంది పిల్లలు తమ ఆలనాపాలనా చూసేవారి చేతుల్లో హింసకు గురవుతున్నారు. 22% మంది పిల్లలు బాలకార్మికులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- మానసిక సమస్యలు 14ఏళ్ల వయసుకు వచ్చేసరికల్లా ఎక్కువవుతాయి. ఇందులో అత్యధిక సమస్యలను ఎవ్వరూ గుర్తించరు. చికిత్స అందించరు. సమస్య తీవ్రమయ్యేంత వరకూ వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. ఆ కుంగుబాటు పిల్లల జీవితాలను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది.
- తల్లిదండ్రులు, పాఠశాలలు, మానవ సంబంధాలు, హింస, దుష్ప్రవర్తన, దోపిడీ, సామాజిక, ఆర్థిక ఒత్తిళ్లు కూడా పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి.
- 10-19 ఏళ్ల మధ్య వయసులోని పిల్లల్లో తలెత్తుతున్న మానసిక రుగ్మతల వల్ల రూ.28.87 లక్షల కోట్ల మేర మానవ వనరుల నష్టం సంభవిస్తోంది. ఇందులో రూ.25.36లక్షల కోట్ల నష్టం ఆందోళన, కుంగుబాటులాంటి సమస్యల వల్ల, రూ.3.51 లక్షల కోట్ల నష్టం ఆత్మహత్యల వల్ల కలుగుతోంది.
- ఏడాదికి 45,800 మంది కౌమార దశలోని పిల్లలు ఆత్మహత్య చేసుకుంటుండగా అందులో 10-19 ఏళ్ల వయస్సు వారి మరణాలకు ఆత్మహత్య 5వ ప్రధాన కారణమవుతోంది. 15-19 ఏళ్ల వయస్సు వారిలో మరణాలకు రోడ్డు ప్రమాదాలు, టీబీ, హింస తర్వాత బలవన్మరణం ఓ కారణమవుతోంది.