కరోనా మహమ్మారి(CORONA VIRUS) ఉత్పరివర్తనం చెందుతూ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వివిధ రకాల వేరియంట్లతో ఏ ఔషధం పనిచేస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో తీవ్రమైన కొవిడ్-19(COVID-19)ను నిరోధించే అత్యంత సమర్థమైన ఔషధాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఈ డ్రగ్.. శ్వాసకోశాలపై ప్రభావం చూపుతోన్న ఇతర కరోనా వేరియంట్ల(Corona variants)ను సైతం అడ్డుకుంటున్నట్లు నిర్ధరించారు. సార్స్-కోవ్-2 బారినపడి తీవ్రంగా ప్రభావితమైన ఎలుకలపై పరిశోధన చేసి తేల్చారు.
ఈ డ్రగ్‌పై చేసిన అధ్యయనం జర్నల్ సైన్స్ ఇమ్యూనోలజీలో ప్రచురితమైంది. ఆ ఔషధమే డి-ఏబీజెడ్ఐ. శరీరంలోని సహజమైన రోగనిరోధక వ్యవస్థను మేల్కొలిపి.. వైరస్‌పై స్పందించేలా చేస్తోందని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు.
" రోగనిరోధక ప్రతిస్పందనను ఒకే మోతాదుతో మేల్కొలపటం.. వైరస్‌ను నియంత్రించటానికి మంచి వ్యూహమని ఈ అధ్యయనం చెబుతోంది. ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన దక్షిణాఫ్రికా రకం వైరస్ బి.1.351పైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తోంది. సార్స్-కోవ్-2 వ్యాప్తిని అడ్డుకునేందుకు సమర్థమైన యాంటీవైరల్స్‌ను అభివృద్ధి చేయటం ప్రస్తుతం అత్యవసరం. ముఖ్యంగా ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొస్తున్న ఈ సమయంలో చాలా అవసరం."