అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పరపతిని ఆమె సమీప బంధువు మీనా హారిస్ వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకొనేందుకు వాడుకోవడంపై శ్వేతసౌధం అభ్యంతరం తెలిపినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. కమలా అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కూడా మీనా ధోరణి మారకుంటే.. ఇటువంటి సున్నితమైన అంశాలే బైడెన్-హారిస్ ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
36 సంవత్సరాల మీనా హారిస్, కమలా హారిస్ సోదరి కుమార్తె. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈమె కమలా హారిస్ తరపున విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎనిమిది లక్షలకు పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. న్యాయవాది అయిన మీనా.. "కమలా అండ్ మాయాస్ బిగ్ ఐడియా" తదితర పుస్తకాలు కూడా రాశారు. ఈమె 'ఫినామినల్' అనే వస్త్రాల బ్రాండ్‌కు వ్యవస్థాపకురాలు కూడా. ఐతే తమ బ్రాండ్ వస్త్రాలపై 'వైస్ ప్రెసిడెంట్ ఆంటీ' అంటూ ముద్రించడం, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రైవేటు విమానంలో ప్రయాణించటం వంటి చర్యలు విమర్శలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో మీనా కార్యకలాపాల్లో వైస్ ప్రెసిడెంట్ పేరును ఉపయోగించవద్దని.. వైట్ హౌస్‌కు చెందిన న్యాయవాదులు మీనా హారిస్‌కు హితవు పలికారు. అంతేకాకుండా ఉపాధ్యక్షురాలి బంధువుగా ఆమె పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా వివరించినట్లు తెలిసింది.