తెలంగాణ

telangana

ETV Bharat / international

చేయని నేరానికి జైలులోనే 43 ఏళ్లు.. చివరకు..

అమెరికాకు చెందిన కెవిన్​ స్ట్రిక్​లాండ్​ చేయని నేరానికి 43 ఏళ్ల పాటు జైలు శిక్ష (Kevin Strickland Story) అనుభవించాడు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈనెల 23న నిర్దోషిగా తెలుస్తూ కోర్టు అతడిని జైలు నుంచి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కెవిన్​కు ఆర్థిక సాయం అందించేందుకు 'గో ఫండ్ ​మీ' అనే సంస్థ రూ. 10 కోట్లు విరాళంగా సేకరించింది.

kevin strickland hearing
కెవిన్​ స్ట్రిక్​లాండ్

By

Published : Nov 28, 2021, 1:05 PM IST

Kevin Strickland Story: చేయని నేరానికి జైలుకు వెళ్లిన వ్యక్తులు నిర్ధోషిగా తేలి బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన కెవిన్​ స్ట్రిక్​లాండ్​ అనే వ్యక్తి కూడా హత్య చేశాడన్న ఆరోపణలు ఎదుర్కోవడం వల్ల జైలుకు వెళ్లాడు. కానీ ఆ జైలు నుంచి స్వేచ్ఛ లభించడానికి అతనికి ఒకటి, రెండు కాదు ఏకంగా 43 సంవత్సరాలు పట్టింది. 18 ఏళ్ల వయసులో అరెస్ట్​ అయిన కెవిన్​​ 62 ఏళ్లు వృద్ధుడిగా జైలు నుంచి బయటకు వచ్చాడు.

అసలు ఏం జరిగింది?

అది 1978 ఏప్రిల్​ 25. కాన్సాస్​ నగరంలోని ఓ ఇంటిపై గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు దాడి చేశారు. లేరీ ఇన్​గ్రామ్​, జాన్​ వాకర్, షెర్రీ బ్లాక్​ అనే ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఘటన నుంచి తప్పించుకున్న సింథియా డౌగ్లస్​ అనే మహిళ కాల్పులు జరిపిన నలుగురిలో కెవిన్ ఉన్నాడని భావించి అతని పేరును పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కెవిన్​ను అరెస్ట్​ చేశారు. కోర్టు విచారణలో కూడా డౌగ్లస్​ అదే విషయాన్ని చెప్పింది. కానీ ఆ తర్వాత డౌగ్లస్​ తాను పొరబడినట్లు తెలుసుకున్నా.. బహిరంగంగా ఇప్పుడు తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటే కోర్టు తనకు శిక్ష విధిస్తుందేమో అన్న భయంతో ఈ విషయం గురించి కొంతకాలం ఎక్కడా చెప్పలేదు. డౌగ్లస్​ సాక్ష్యాన్ని పరిగణించి కెవిన్​కు కోర్టు శిక్ష ఖరారు చేసింది.

దశాబ్దాలు గడిచాక మళ్లీ ఈ ఏడాది ఆగస్టులో కెవిన్​ శిక్షను సవాల్​ చేస్తూ స్థానిక ప్రాసిక్యూటర్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న డౌగ్లస్​ మృతిచెందం వల్ల కోర్టు ఆమె కుటుంబసభ్యులను, స్నేహితులను విచారించింది. పోలీసులే కెవిన్​ దోషి అని చెప్పమని తనను ఒత్తడి చేశారని డౌగ్లస్​ ఓ సందర్భంలో తమతో వెల్లడించినట్లు ఆమె తరపు వారు కోర్టుకు తెలిపారు. తాను చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు డౌగ్లస్​ ప్రయత్నించిందని పేర్కొన్నారు.

హత్యకు పాల్పడిన నిందితులు కూడా ఓ సందర్భంలో కెవిన్​తో తమకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించిన విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ కెవిన్​ను నిర్దోషి అని తేల్చింది. ఈనెల 23న కెవిన్​ జైలు నుంచి విడుదలయ్యాడు.

రూ.10 కోట్లు విరాళం

తప్పుడు తీర్పు ఇచ్చినందుకు అందాల్సిన నష్టపరిహారం కూడా కెవిన్​కు అందలేదు. దీంతో అతనికి సాయం చేసేందుకు 'గో ఫండ్ ​మీ' అనే సంస్థ ముందుకొచ్చింది. రూ.10.50 కోట్లు విరాళంగా సేకరించి కెవిన్​కు అందించింది.

ఇదీ చూడండి :వారాంతంలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details