తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీ కూడా మెచ్చుకున్నారు: డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రస్తావన తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో కరోనా టెస్టుల గురించి ఓ రోడ్​ షోలో మాట్లాడారు ట్రంప్. కరోనా టెస్టులను అమెరికా భారీస్థాయిలో చేపట్టడం గొప్పవిషయమని మోదీ కొనియాడినట్లు పేర్కొన్నారు.

Donald Trump claims 'Modi certificate' as he holds packed rallies in the time of pandemic
మోదీ కూడా మెచ్చుకున్నారు..: డొనాల్డ్‌ ట్రంప్‌

By

Published : Sep 14, 2020, 5:31 AM IST

Updated : Sep 14, 2020, 11:44 AM IST

అమెరికాలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగా చేపడుతున్నామని అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరుపై వస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు. ప్రపంచంలో ఏ దేశం చేపట్టని విధంగా అమెరికా కొవిడ్‌ టెస్టులు నిర్వహిస్తోందని ట్రంప్‌ వెల్లడించారు.

ఫోన్​ చేసి మెచ్చుకున్న మోదీ!

బహిరంగ సభలు, రోడ్‌షోలతో బిజీగా ఉన్న ట్రంప్‌, ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కరోనా టెస్టులను అమెరికా భారీస్థాయిలో చేపట్టడం గొప్పవిషయమని నరేంద్ర మోదీ కూడా కొనియాడినట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. కరోనా టెస్టులతో గొప్పపని చేస్తున్నారని నరేంద్రమోదీ తనకు ఫోన్‌ చేసి మెచ్చుకున్నట్లు ట్రంప్‌ తెలిపారు.

అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో అమెరికా ప్రథమ స్థానంలో, భారత్‌ రెండో స్థానంలో ఉందని ఆయన మరోసారి స్పష్టంచేశారు. ఇప్పటివరకు అమెరికా 9.5కోట్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా, భారత్‌లో ఇప్పటివరకు 5.6కోట్లకుపైగా టెస్టులు చేసినట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి.

బైడెన్‌పై విరుచుకుపడుతోన్న ట్రంప్‌..

అమెరికాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో అక్కడి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. బహిరంగ సభలు, రోడ్‌షోలతో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీనిలోభాగంగా ప్రత్యర్థి జో బైడెన్‌పై విరుచుకుపడుతున్నారు. తాజాగా నెవాడా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమంలోనూ ట్రంప్‌.. బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. భవిష్యత్‌ మొత్తం అమెరికాదేనని.. చైనాది కాదని ట్రంప్‌ పునరుద్ఘాటించారు. మనం గెలిస్తే అమెరికా గెలిచినట్లేనని.. ఒకవేళ జోబైడెన్‌ను గెలిపిస్తే చైనాను గెలిపించినట్లేనని విమర్శించారు. జో బైడెన్‌ 47ఏళ్ల కాలంలో చేసిన పనిని తాను కేవలం 47నెలల్లోనే చేసినట్లు ట్రంప్‌ చెప్పుకొచ్చారు. మరోవైపు భారతీయులను కూడా ఆకట్టుకునేందుకు ట్రంప్‌ బృందం ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అయితే, నవంబర్‌ మూడో తేదీన జరిగే అమెరికా అధ్యక్షపదవి రేసులో ప్రత్యర్థి బైడెన్‌కంటే ట్రంప్‌ కాస్త ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అమెరికాలో 64లక్షల మందిలో వైరస్‌ బయటపడగా, ఇప్పటికే వీరిలో లక్షా 93వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

Last Updated : Sep 14, 2020, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details