పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీకి డొమినికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను అక్కడి హైకోర్టు తిరస్కరించింది. ఫ్లైట్ రిస్క్ కారణాలతో ఆయనకు బెయిల్ ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే మెహుల్ చోక్సీకి డొమినికాతో ఎలాంటి సంబంధాలు లేవని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తాను తప్పించుకోబోనని చోక్సీ కోర్టుకు హామీ ఇచ్చేలా అతనిపై న్యాయస్థానం ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది.
బలమైన హామీ ఇవ్వలేదు..
పైగా పిటిషన్‌లో మెహుల్ చోక్సీ.. తన సోదరుడు ఉన్న హోటల్లో ఉంటానని పేర్కొనడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ కచ్చితమైన చిరునామా లేని హోటల్లో ఉంటానని ఎలా హామీ ఇవ్వగలడని ప్రశ్నించింది. పిటిషన్‌లో చోక్సీ ఎలాంటి బలమైన హామీ ఇవ్వలేకపోయాడని తెలిపింది. పైగా ఇంకా కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదని గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నామని తెలిపింది. చోక్సీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. దేశం విడిచి వెళ్లే అవకాశం లేదని అతని కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ.. కోర్టు వారి వాదనను పరిగణనలోకి తీసుకోలేదు.