ఇండో-పసిఫిక్ ప్రాంతం ఆధిపత్య పోరుకు కేంద్రంగా మారిందని, అంతర్జాతీయంగా తన అధికారం చూపేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ చెప్పారు. అంతర్జాతీయ నియమాలకు డ్రాగన్ లోబడే పరిస్థితులను కల్పించేందుకు.. భారత్ వంటి భాగస్వామ్య దేశాలతో అమెరికా తన బంధాలను బలోపేతం చేస్తోందన్నారు. ఈ మేరకు ఆయన హవాయిలోని 'డేనియల్ కె ఇనోయి ఆసియా-పసిఫిక్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్'లో బుధవారం కీలకోపాన్యాసం చేశారు.
"భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నాలను అమెరికా ప్రోత్సహిస్తుంది. నిజానికి అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఆ దేశ సైన్యం దూకుడుగా వెళ్తోంది. ఈ శతాబ్ద మధ్యకాలం నాటికి ప్రపంచ స్థాయి సైనిక ప్రమాణాలను అందుకోవడమే దాని లక్ష్యం. చిన్న దేశాల కష్టాలను ఆసరగా చేసుకుని ఆర్థిక సాయం అదించడం, తర్వాత వాటిని ఒత్తిళ్లకు గురిచేయడం చైనాకు పరిపాటిగా మారింది. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతాల్లో ఆ దేశం ప్రాదేశిక వివాదాలను రెచ్చగొడుతోంది. సైన్యం దూకుడుగా వెళ్లేందుకు దన్నుగా నిలుస్తోంది. ఆఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా అనేక యాక్సెస్ పాయింట్ల వద్ద తన భద్రతా దళాలను మోహరించడం ద్వారా.. విశ్వవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నిస్తోంది. అయితే ఆగ్నేయ దక్షిణాసియా ప్రాంతాల్లో అమెరికా తన బలాన్ని పెంచుకునేందుకు పలు దేశాలతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే భారత్తో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాం. రక్షణ భాగస్వామ్యాన్ని పెంపొందించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్చడానికి, అంతరాయాలు సృష్టించడానికి, అణచివేతకు పాల్పడటానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను అమెరికా దాని మిత్రదేశాలు నిర్మాణాత్మకంగా తిప్పికొడుతున్నాయి. ట్రంప్ సర్కారు ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేయడానికి మిత్ర దేశాలు సహకారం అందించాలి."