ప్రస్తుతం మానవాళి మనుగడకే పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని ఎలా కట్టడి చేయాలని ప్రపంచ దేశాలు తర్జనభర్జన పడుతున్నాయి. వ్యాక్సిన్ కోసం ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే శునకాల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు అమెరికా, బ్రిటన్లో ఇప్పటికే కుక్కలకు శిక్షణ కూడా ఇస్తున్నారని.. వాటికి వైరస్ వాసనను పసిగట్టగలిగే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారని 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో లాబ్రాడర్ రిట్రీవర్స్కు చెందిన ఎనిమిది కుక్కలపై పరిశోధనలు జరుగుతున్నట్లు పేర్కొంది.
గంటకు 250 మంది స్క్రీనింగ్
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్లోనూ ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయని తెలిపింది వాషింగ్టన్ పోస్ట్. మానవుల్లో మలేరియా ఇన్ఫెక్షన్లను కుక్కలు పసిగట్టగలవని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ శాస్త్రవేత్తలు గతంలో ధ్రువీకరించారు. ఇప్పుడు కరోనాపై దృష్టి సారించారు. ఒకవేళ కుక్కలు కరోనాను పసిగట్టగలిగితే.. విమానాశ్రయాలు, ఆసుపత్రులు, ఇతర వ్యాపార ప్రాంతాల్లో ప్రజలను స్క్రీనింగ్ చేసేందుకు వీటిని వినియోగించొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.