తెలంగాణ

telangana

ETV Bharat / international

మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరమా?

మాస్కులు ధరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్న వదంతులను వైద్య నిపుణులు కొట్టిపారేశారు. శిశువులు, చిన్నారులు మాస్కులు వేసుకుంటే... వారికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని తెలిపారు. అంతేకానీ మాస్కుల వల్ల అంటువ్యాధులు సోకుతాయని, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.

Does wearing a mask pose any health risks?
మాస్కులు ధరించడం ఆరోగ్యానికి హానికరమా?

By

Published : Jul 2, 2020, 4:00 PM IST

కరోనా మహమ్మారి వల్ల ఏం చేసినా భయం భయంగానే ఉంటోంది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడానికి శానిటైజర్లను విపరీతంగా వాడేస్తున్నారు ప్రజలు. ఇది చేతులకు మంచిది కాదని అనేకమంది నిపుణులు చెబుతున్నారు. తాజాగా.. మాస్కులు ధరిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజం?

మాస్కులు ధరిస్తే మంచిదే...

మాస్కులు ధరించడం వల్ల చాలా మందిలో ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అయితే శిశువులు, చిన్నారులు మాస్కులు ధరిస్తే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల సహాయం లేకుండా మాస్కును ముఖం నుంచి తొలగించలేని వారికి కూడా ఊపిరి ఆడటం కష్టమవుతుంది. మిగిలిన వాళ్లు నిర్భయంగా మాస్కులు ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్​ కట్టడిలో భౌతిక దూరం నియమంతో పాటు మాస్కు ధరించడం కూడా అత్యవసరమని అంతర్జాతీయంగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్​ ముఖ్యంగా తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందని చెబుతున్నారు. మనిషి మాట్లాడినప్పుడు, పాటలు పాడినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వైరస్..​ తుంపర్ల ద్వారా వ్యాప్తిచెందుతుందని పేర్కొన్నారు. మాస్కులు ధరిస్తే.. ఆ తుంపర్లు ఇతరులకు చేరడానికి తక్కువ అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. శరీరంలో వైరస్​ ఉండే అవకాశముందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

మాస్కులు ధరించడం అలవాటు లేని వారికి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుందని.. అయితే ఇందుకు వాతావరణంలోని ఆర్ద్రత ఓ కారణమని టెక్సాస్​ ఏ అండ్​ ఎమ్​ విశ్వవిద్యాలయ జీవశాస్త్ర ప్రొఫెసర్​ బెంజమిన్​ న్యూమన్​ వివరించారు. అంతే కానీ.. శరీరంలోని ఆక్సిజన్​ను మాత్రం మాస్కులు తగ్గించలేవని స్పష్టం చేశారు.

మాస్కుల వల్ల అంటువ్యాధులు వస్తాయనడానికీ ఎలాంటి ఆధారాలు లేవని బోస్టన్​ విశ్వవిద్యాలయానికి చెందిన అంటువ్యాధి నిపుణుడు డేవిడ్​సన్​ హామర్​ వెల్లడించారు.

ఒకసారి వాడిపడేయాల్సిన మాస్కులను మళ్లీ మళ్లీ ఉపయోగించకూడదు. బట్టతో తయారు చేసిన మాస్కులను మాత్రం తరచూ శుభ్రం చేయడం మంచిది.

ఇదీ చూడండి-మాస్కులను ఎప్పుడు ఎలా వాడాలి.. ఎవరు వాడకూడదు?

ABOUT THE AUTHOR

...view details