ఇది వరకు శస్త్ర చికిత్సలు చేసే వైద్యులు, కొన్ని పరిశ్రమల్లోని కార్మికులు ఇలా చాలా తక్కువ మంది మాత్రమే మాస్కు ధరించేవారు. మరి, ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చి అందరి మూతికి మాస్కు కట్టేసింది. ఈ మాస్కు వల్ల మన నుంచి వైరస్ పక్కవారికి సోకకుండా ఉంటుందని నమ్మేవారు కొందరైతే.. ఇతరులనుంచి మనకే వైరస్ సోకదని వాదించేవారు మరి కొందరు. అయితే, నిజానికీ ఈ రెండు వాదనలూ సబబే అంటున్నారు కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు.
మాస్కు పెట్టుకోవడం వల్ల మనకూ ప్రయోజనముందంటున్నారు కాలిఫోర్నియా వర్సిటీలో వైరాలజీ నిపుణులురాలు డాక్టర్ మోనికా గాంధీ. మాస్కు వాడడం వల్ల మన ముక్కు, నోటిలోని వైరస్ బ్యాక్టీరియా బయటివారికి సోకదు. అలాగే, మన శరీరంలోకి గాలిలోని ఇతర సూక్ష్మ జీవులు ప్రవేశించవు. ఇది కరోనా మాత్రమే కాదు, చిన్న చితకా వ్యాధులూ సోకకుండా మనల్ని రక్షిస్తుందని పరిశోధనలో తేలిందన్నారు.