అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో శుక్రవారం తొలి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కొవిడ్-19పై పోరాటం సహా విస్తృత ప్రాధాన్యతా అంశాలపై శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌లో సుమారు గంటపాటు చర్చించారు. అయితే.. ఈ సమావేశంలో భారత్‌లో ఇంటి పేర్లతో అనుబంధాలు ముడిపెట్టకోవడంపై బైడెన్ సరదాగా మాట్లాడారు.
1972లో సెనెటర్‌గా తాను తొలిసారి ఎన్నికైనప్పుడు ముంబయి నుంచి ఓ వ్యక్తి లేఖ రాస్తూ.. తన ఇంటి పేరు 'బైడెన్' అని పేర్కొన్నారని బైడెన్ గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యక్షుడి హోదాలో ముంబయి వచ్చినప్పుడు కొందరు విలేకరులు ఇదే విషయంపై తనను అడిగారని చెప్పారు. ఆ మరుసటి రోజే భారత్‌లో అయిదుగురు బైడెన్లు ఉన్నారని పత్రికలు రాశాయని తెలిపారు. అయితే, వారి గురించి తానెప్పుడూ ఆరా తీయలేదన్నారు. బహుశా ఇవ్వాళ్టి సమావేశం అందుకు ఏమైనా ఉపయోగపడుతుందేమోనంటూ చమత్కరించారు. దీనికి సంబంధించి తాను కొన్ని పత్రాలను తీసుకొచ్చినట్లు తెలిపిన మోదీ...'వారు మీ బంధువులే' అని తెలిపినప్పుడు హాలులో నవ్వులు విరిశాయి.
ఆప్యాయంగా ఆలింగనం...
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలిసారి జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.