అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితులను శ్వేతసౌధం వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కరోనా నియంత్రణ కోసం ఆయన రెండు వారాల పాటు మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గుండె లయ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు వైద్యులు.
"ప్రస్తుతం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారు. రెండువారాల మలేరియా కోర్సు తీసుకున్నప్పటికీ ఆయనపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపలేదు."
- సీన్ కొన్లీ,వైద్యుడు
బరువు పెరిగిన ట్రంప్
ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఆయన ఓ పౌండ్ వరకు బరువు పెరిగారని సీన్ కొన్లీ తెలిపారు. అయితే ఆయనలో కొవ్వు శాతం తగ్గిందని కూడా వెల్లడించారు.
ప్రస్తుతం ట్రంప్ బరువు 244 పౌండ్లు. ఆయన ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు. దీని ప్రకారం చూస్తే ఆయన బాడీ మాస్ ఇండెక్స్ 30.5. నిజానికి బాడీ మాస్ 30 ఉండాలి. అంటే ట్రంప్ ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్నట్లు లెక్క. నిజానికి అమెరికాలో 40 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు.