తెలంగాణ

telangana

ETV Bharat / international

అక్కడ కొవిడ్​ చికిత్స కోసం 'బ్లీచింగ్​ పౌడర్​' టీకా - కొవిడ్​ బొలివియా చికిత్స

'కరోనాపై పోరు కోసం క్రిమిసంహారకాలు ఉపయోగించాలి,' అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారమే రేగింది. అయితే ట్రంప్​ వ్యాఖ్యలను బొలివియా తీవ్రంగానే పరిగణించింది. కరోనాపై పోరుకు బ్లీచింగ్​ను విచ్చలవిడిగా ఉపయోగిస్తోంది. ఇన్​జెక్షన్లు, స్ప్రేలు ప్రజలకు ఇస్తున్నాయి అక్కడి ఆసుపత్రులు. ఇదంతా అక్కడి ప్రభుత్వం 'అనుమతుల'తోనే జరుగుతుండటం గమనార్హం. దీనిపై ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

covid tratement
బ్లీచింగ్​

By

Published : Oct 8, 2021, 4:34 PM IST

దక్షిణ అమెరికాలోని బొలివియాలో కొవిడ్​ కట్టడికి వినూత్న చర్యలు చేపట్టాయి ఆసుపత్రులు. కొవిడ్​ రోగులకు బ్లీచింగ్​ పౌడర్​తో చికిత్స చేస్తున్నాయి. కరోనా పంజా విసిరిన తొలినాళ్ల నుంచి ఇది నడుస్తోంది. చికిత్సకు బ్లీచింగ్​ పౌడర్​ వాడితే, మంచి ఫలితాల్ని ఇస్తోందని వైద్యులు అంటుండటం గమనార్హం.

కొవిడ్​పై పోరు కోసం క్రిమిసంహారకాలు తీసుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ గతంలో ఓ ప్రకటన చేశారు. ఆనాడు ఆయన వ్యాఖ్యలపై అనేకమంది ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బొలివియాలో ఇదే జరుగుతోంది. ఇన్​జెక్షన్లు, స్ప్రేల రూపంలో రోగులకు ఇస్తున్నారు వైద్యులు. కొవిడ్​ టీకాల సైడ్​ఎఫెక్ట్​లను కూడా బ్లీచింగ్​తో కట్టడి చేయవచ్చని వీరు చెబుతున్నారు.

బొలివియాలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. కొవిడ్​ చికిత్సలో బ్లీచింగ్​ను వాడేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతులిచ్చింది. వాటి ఉత్పత్తి, అమ్మకాల కోసం చట్టపరమైన చర్యలు కూడా చేపట్టింది.

బ్లీచింగ్​తో ముప్పు!

అమెరికా ఎఫ్​డీఏ(ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్​).. బ్లీచింగ్​ వాడకంపై ఇప్పటికే అనేక హెచ్చరికలు జారీ చేసింది. ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు వస్తాయని తేల్చింది. కొవిడ్​తో ఇప్పటికే కష్టంగా ఉందని, ప్రజలు అనవసరమైన విషయాలు నమ్మి భారీగా బ్లీచింగ్​ను తాగితే వారి ఆరోగ్యం దెబ్బతింటుందని బొలివియాలోని ఎపిడమాలజిస్ట్​లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల సంఖ్య పెరగడం వల్ల ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కానీ బొలివియాలో బ్లీచింగ్​ ఉత్పత్తిదారులు మాత్రం.. 'నేలపై క్రిములను బ్లీచింగ్​ ఎలా నాశనం చేస్తుందో, కడుపులోని వైరస్​ను కూడా అదే విధంగా ధ్వంసం చేస్తుంది,' అని ప్రచారాలు చేస్తున్నారు.

ప్రజలు బ్లీచింగ్​ కోసం ఎగబడటానికి.. కొవిడ్​ వ్యాక్సిన్లపై ఉన్న అపోహలు కూడా ఓ కారణం. తొలినాళ్లల్లో.. టీకాలో గ్రఫీన్​ ఆక్సైడ్​ ఉంటుందని, దాని వల్ల మనిషి శరీరానికి ప్రమాదం అని ప్రచారం జరిగింది. మధుమేహంతో బాధపడుతున్న ప్రజలు టీకా తీసుకుంటే చనిపోతారని కూడా ప్రచారం సాగింది. దీంతో ప్రజలు బ్లీచింగ్​ తీసుకునేందుకు పరుగులు తీశారు. టీకా రెండు డోసులు తీసుకున్న వారు కూడా బ్లీచింగ్​ ఇన్​జెక్షన్ల కోసం క్యూలో నిలబడుతుండటం గమనార్హం.

ఇలా బ్లీచింగ్​ ఇన్​జెక్షన్లు అమ్ముతూ కొందరు ప్రజలను దోచుకుంటున్నారు. మూడు రోజుల కోర్సు అంటూ ఒక్కొక్కరి నుంచి 150డాలర్లు వసూలు చేస్తున్నారు. బొలివియాలో చాలామంది సగటు నెలవారీ జీతం 700డాలర్లుగా ఉండటం గమనార్హం.

ప్రజల ఆరోగ్యంతో 'రాజకీయాలు'

బొలివియా రాజకీయ పరిణామాలు కూడా బ్లీచింగ్​ అమ్మకాలకు ఓ రకంగా ఊతమందించాయి. ఎన్నికల్లో మోసం జరిగిందంటూ 2019 నవంబర్​లో మిలిటరీ ఒత్తిడి మేరకు నాటి వామపక్ష అధ్యక్షుడు ఎవో మొరేల్స్​ పదవికి రాజీనామా చేశారు. అనంతరం విపక్ష కన్జర్వేటివ్​ నుంచి జీనిన్​ సీజ్​.. తనని తాను దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో దేశంపై కొవిడ్​ పంజా విసిరింది. ప్రాణాలు రక్షించుకోవాలంటూ.. దేశవ్యాప్తంగా కఠిన లాక్​డౌన్​ను అమలు చేశారు సీజ్​. అప్పటికే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న ప్రజలపై లాక్​డౌన్​ భారం పెద్దగానే పడింది. దీంతో సీజ్​పై వ్యతిరేకత పెరిగింది. అటు అధ్యక్ష ఎన్నికలు ముంచుకొచ్చాయి.

సరిగ్గా ఈ సమయంలోనే బ్లీచింగ్​ అమ్మకాలు పెరిగిపోయాయి. కొవిడ్​పై పోరుకు బ్లీచింగ్​ మెరుగైన అస్త్రమని భావించిన ప్రజలు ఎగబడ్డారు. సీజ్​ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కానీ అప్పటికి విపక్షంలో ఉన్న వామపక్షానికి ఇది మంచి అవకాశంగా మారింది. బ్లీచింగ్​ అమ్మకాన్ని ప్రోత్సహించింది. ఆ దేశ సెనేట్​లో వామపక్షానికి చెందిన సోషలిజం పార్టీకి మెజారిటీ ఉండటం వల్ల కొవిడ్​పై చికిత్స కోసం బ్లీచింగ్​ వినియోగానికి అనుమతినిస్తూ 2020 జులైలో బిల్లును ఆమోదించింది. అక్టోబర్​ 14న చట్టం కార్యరూపం దాల్చింది. దీనిని సీజ్​ ప్రభుత్వం వ్యతిరేకించినా, ఏమీ చేయలేకపోయింది. నాలుగు రోజుల తర్వాత వెలువడిన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఆమె ఓడిపోయారు.

వామపక్షం తీసుకొచ్చిన చట్టంతో యూనివర్సిటీలు బ్లీచింగ్​ను తయారు చేయడం మొదలుపెట్టాయి. అమ్మకాలు కూడా చేపట్టాయి. ఆభరణాల రూపంలోనూ బ్లీచింగ్​ను అమ్మేశాయి. వాటిని మెడకు ధరిస్తే, వాటిలో ఉన్న బ్లీచింగ్​ పదార్థాల కారణంగా కొవిడ్​ అంటుకోదంటూ ప్రచారాలు చేశారు.

ఇదీ చూడండి:-కరోనా పోతుందని 'బ్లీచింగ్'‌ తాగుతున్నారట!

ABOUT THE AUTHOR

...view details